ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ..ఎమ్మెల్యే vs ఎంపీ…!

రాజకీయాల్లో అనుభవం తక్కువైనప్పటికీ అనతికాలంలోనే సంచలనంగా మారారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని. టీడీపీ నుంచి వైసీపీలో చేరటం.. చేరిన వెంటనే అసెంబ్లీ టికెట్‌ దక్కించుకోవడం.. గెలవడం వేగంగా జరిగిపోయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత వైసీపీ సీనియర్‌ నేత మర్రి రాజశేఖర్‌తో విడదల రజనీ వివాదాలు పార్టీలు హాట్ హాట్‌ చర్చకు దారితీశాయి.ఆ తర్వాత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులతో గొడవలు తారాస్థాయికి వెళ్లాయనే చెప్పాలి.

రజనీ ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ఆరోపణలు రావడంతో గురజాల డీఎస్పీతోపాటు సీఐని వీఆర్‌కు పంపారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ జోక్యంతోనే వారు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్నది ఎమ్మెల్యే వర్గం చేస్తోన్న ఆరోపణ. ఫోన్‌ ట్యాపింగ్‌ తీవ్రమైన నేరం. ఆ పేరుతో చర్యలు తీసుకోవాలంటే విషయం చాలా దూరం వెళ్తుంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దాని వెనక ఉంది ఎవరు? అన్నవన్నీ బయటకు రావాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ సబ్జెట్‌ లేకుండా డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పకపోయినా.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు పడిందనేది బయట జరిగే ప్రచారం.

కేబినెట్‌లో బెర్త్‌ కోసమే కీలకమైన ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ఎవరిపైనా విమర్శలు చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట విడదల రజని. కానీ.. తెరవెనక ఏం చేయాలో అది చేస్తున్నారట. అలాగే పార్టీలోని తన ప్రత్యర్థులు ఏం చేస్తున్నా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారట. పార్టీ పెద్దలు సలహా ఇచ్చారో లేక ఇక్కడ తగ్గితే అక్కడ నెగ్గొచ్చని లెక్కలు వేసుకున్నారో కానీ ఎమ్మెల్యే రజనీ ఎత్తుగడలు మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.