గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా జగన్ ముందుకెళుతున్నారని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చాక వరుసపెట్టి పదవులు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలువురుకు పదవులు ఇచ్చారు. ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి జగన్ కోసం కష్టపడ్డ పోసాని కృష్ణమురళి, ఆలీలకు సైతం తాజాగా పదవులు ఇచ్చారు.
2019 ఎన్నికల్లో వీరు..వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక పోసాని ప్రెస్ మీట్లు పెట్టి ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో చెప్పాల్సిన పని లేదు. అలాగే పవన్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలా విమర్శలు చేస్తూ వచ్చిన పోసానికి వైసీపీలో ఎలాంటి పదవి రాలేదు. పైగా ఆయన కూడా ఈ మధ్య రాజకీయాల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా ఆలీకి నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆలీని నియమించారు.
ఇక ఆలీకి పదవి ఇచ్చిన రెండు రోజుల్లోనే పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. అటు జగన్ సొంత మీడియాలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావుకు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా వరుసపెట్టి పదవుల పంపకం చేశారు. అయితే వైసీపీ కోసం ఇంకొంతమంది సినీ నటులు పనిచేశారు. వారిలో మోహన్ బాబు కూడా ఉన్నారు..కానీ ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. అటు మోహన్ బాబు సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే ఆలీ, పోసానిలకు పదవులు ఇచ్చిన నేపథ్యంలో శ్రీరెడ్డికి కూడా ఏదొక పదవి ఇస్తారా? అని చెప్పి టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు-పవన్‌లని తిట్టేవారికి పదవులు ఇస్తున్నారు కాబట్టి…గతంలో గాని, ఇప్పుడు గాని శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో పవన్‌పై విరుచుకుపడుతుంది..ఆమెకు కూడా పదవి ఇచ్చేయండి అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి వైసీపీ కోసం పనిచేస్తున్న శ్రీరెడ్డి కూడా పదవి ఇస్తారేమో చూడాలి.