కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమవ్వగా.. కొందరు మాత్రం పాత యాంటీ వైరల్ మందులనే కరోనాపై ప్రయోగించి పరీక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు ఎబోలా చికిత్స కోసం తయారు చేయబడిన రెమ్‌డెసివిర్ (Remdesivir) అనే మందు ఇప్పుడు ఇప్పుడు కరోనా వైరస్‌పై చాలా వేగంగా పనిచేస్తుందని సైంటిస్టులు తేల్చారు.
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) వారు ఫిబ్రవరి 21 నుంచి ఇప్పటి వరకు అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు చెందిన 1063 మందిపై రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను ప్రయోగించి చూశారు. వారిలో కొందరికి ప్లేసిబో ఇవ్వగా.. కొందరికి రెమ్‌డెసివిర్ మందును ఇచ్చారు. ఈ క్రమంలో ప్లేసిబో ఇచ్చిన వారి కన్నా రెమ్‌డెసివిర్ ఇచ్చిన వారిలో కరోనా వైరస్ త్వరగా నాశనం అవుతుందని గుర్తించారు. వారిలో ఇతరుల కన్నా 31 శాతం ఆ మందు వేగంగా పనిచేస్తుందని తేల్చారు. అలాగే ప్లేసిబో ఇచ్చిన వారు 15 రోజుల్లో కోలుకుంటే.. సదరు మెడిసిన్ తీసుకున్న వారు 11 రోజుల్లోనే కోలుకున్నారు. దీంతో రెమ్‌డెసివిర్ మందు కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు తేల్చారు.
అయితే ప్రస్తుతానికి ఈ మెడిసిన్‌ను కేవలం కొద్ది మందిపైనే ప్రయోగించినా.. ఈ మందు సత్ఫలితాలను ఇస్తున్నందున కరోనా చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పలు మందులకు ప్రత్యామ్నాయంగా ఈ మందును వాడవవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. మరి ఈ మెడిసిన్‌ను కరోనా చికిత్సకు వాడుతారో, లేదో చూడాలి..!