కరోనా వైరస్‌కు గాను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు మరో 6 నెలలు అయినా పడుతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం కోవిడ్ తీవ్రత స్వల్పంగా, మధ్యస్థంగా ఉన్నవారికి మందులతోనూ.. ఎమర్జెన్సీ ఉన్నవారికి వెంటిలేటర్లు, ఆక్సిజన్ సపోర్ట్, ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివిర్ వంటి మందులతోనూ చికిత్స అందిస్తున్నారు. అయితే కోవిడ్ ఎమర్జెన్సీ ఉన్నవారికి మరో మెడిసిన్ కూడా ఉపయోగపడుతుందని.. ఆ మెడిసిన్ అలాంటి దశలో ఉన్నవారి మరణాలను తగ్గిస్తుందని.. సైంటిస్టులు తేల్చారు.
Bacille Calmette-Guerin (BCG).. దీన్ని 1921వ సంవత్సరంలో టీబీ(ట్యూబర్‌కులోసిస్)ని రాకుండా అడ్డుకునేందుకు తయారు చేశారు. ఇదొక వ్యాక్సిన్. దీన్ని ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్‌ను విస్తృతంగా వాడుతున్న దేశాల్లో ప్రస్తుతం కరోనా బారిన పడిన వారు చాలా తక్కువ సంఖ్యలో మరణిస్తున్నారని వెల్లడైంది. బ్రెజిల్, ఫిన్ లాండ్, జర్మనీలోని కొన్ని ప్రాంతాలు తదితర దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి కరోనా వచ్చినా వారు తేలిగ్గా దాన్నుంచి బయట పడుతున్నారని.. ఆ టీకా తీసుకున్న వారిలో కోవిడ్ మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు.
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ పరిశోధకులు తాజాగా బీసీజీ టీకాకు గాను అధ్యయనం చేపట్టి ఆ వివరాలను వెల్లడించారు. ఈ టీకా తీసుకోని వారు కరోనా వల్ల ఎక్కువగా చనిపోతున్నారని తేల్చారు. తీసుకున్న వాళ్లు కోవిడ్ ఎమర్జెన్సీ దశకు వెళ్లడం లేదని, వెళ్లినా కోలుకుంటున్నారని, అలాంటి వారు చాలా తక్కువగా మృతి చెందుతున్నారని తేల్చారు. ఇవే వివరాలను సదరు పరిశోధకులు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే సైన్స్ జర్నల్‌లోనూ ప్రచురించారు. అయితే దీనిపై మరిన్ని అధ్యయనాలు చేపడుతామని వారు తెలిపారు.