కరోనా మహమ్మారి ఎవరినీ వదలిపెట్టడం లేదు. ఎప్పటికప్పడు కొత్త కొత్తగా రూపాంతరం చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది కరోనా రక్కసి. దీని ధాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. అయితే.. తాజాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నారు జో బైడెన్. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైట్‌హౌస్ వర్గాలు ప్రకటించాయి. 79 ఏండ్ల బైడెన్ గతేడాదే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు.
అయినప్పటికీ.. రెండుసార్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల 21న బైడెన్‌కు తొలిసారిగా కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ తీవ్రత పెద్దగా లేకపోవడం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్‌లో ఉంటూనే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే మహమ్మారి మళ్లీ తిరగబెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలపై విరుచుకు పడుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌పై జాగ్రత్తలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.