టీడీపీ అధికారంలో ఉండగా.. కొందరికి మాత్రమే దక్కిన పదవులు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాత్రం.. ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు.. తర్వాత రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సభ్యులు.. ఇప్పుడు ఆయా కమిటీల్లో కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు.. ప్రతినిదులు ఇలా.. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు టీడీపీలో పదవి లేని నాయకుడు, బహుశ కార్యకర్త కూడా మనకు కనిపించరేమో! మొత్తం 219 మందితో టీడీపీ రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఎటు చూసినా.. ఏ జిల్లాను పలకరించినా.. నాయకులకు పదవులే పదవులు.
ఇక, వీరిలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్య నిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, కోశాధికారులను నియమించారు. ఈ క్రమంలోనే ఇటీవల తాము బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టే.. ఇప్పుడు బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులను ఇచ్చినట్టు పార్టీ ప్రకటించింది. కమిటీలో 50 ఉప కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పూసగుచ్చిట్టు వివరించింది. బీసీలకు 41, ఎస్సీలకు 11, ఎస్టీలకు 3, మైనార్టీలకు 6 శాతం చొప్పున కేటాయింపులు జరిగాయంది!! అదే సమయంలో రాష్ట్ర కమిటీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొంది.
భేష్!! చాలా బాగుంది. ఇంకేముంది.. వచ్చే స్థానికం.. తదుపరి వచ్చే సార్వత్రికాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం.. ఖాయమే! అని అనుకుంటున్నారు చంద్రబాబు.. ఆయన కుమారుడు కొందరు సీనియర్లు! కానీ.. ఇదంతా సులభం కాదని అంటున్నారు పరిశీలకులు. మంది ఎక్కువైతే.. మజ్జిగ పలచనవుతుందనే సామెత స్పష్టంగా టీడీపీలో కనిపిస్తుందని చెబుతున్నారు. గతంలో కొద్ది మందికి మాత్రమే పరిమితమైన పదవులు ఇప్పుడు అందరికీ దక్కడం వల్ల పార్టీ పటిష్టం అవడం మాట అటుంచితే.. పరువు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. నిజానికి పార్టీ పుంజుకునేందుకు పదవులే ప్రమాణమని చంద్రబాబు భావిస్తున్నారని.. కానీ, వాటికి మించి ఏదో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందనేది .. వీరి మాట.
పైగా పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటన కూడా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జరగలేదనే టాక్ వస్తోంది. అంతా కూడా చంద్రబాబు ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరిగినట్టు చర్చించుకుంటున్నారు. పార్టీ విడుదల చేసిన పదవులు పొందిన నేతల జాబితాలోనూ చంద్రబాబు పేరుతోనే నోట్ విడులైంది. అంటే.. ఇక్కడ అచ్చెన్న ప్రస్థావన(రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు) ఎక్కడా కనిపించలేదు. దీంతో పార్టీలో పదవులు పొందినా.. పెత్తనం అంతా.. పైస్థాయిలోనే ఉంటుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. దీంతో చంద్రబాబు వ్యూహం ఫలించే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.