గ్రేటర్‌ మేయర్‌ పీఠం పై కన్నేసిన టీఆర్ఎస్ పెద్దలు…!

-

దుబ్బాక ఉపఎన్నిక అయిపోయింది. అధికార టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు అందరి దృష్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడింది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం కోసం టీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున లాబీయింగ్‌ మొదలైంది. జనరల్‌ మహిళకు రిజర్వ్ కావడంతో బడా నేతలు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మేయర్‌ పీఠంపై పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంటుందని చర్చ మొదలైంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరితో ప్రస్తుత కౌన్సిల్‌ పదవీకాలం ముగుస్తుంది. షెడ్యూల్‌ కంటే ముందుగానే గ్రేటర్‌ పోరు ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కార్పొరేటర్‌ టికెట్ల కోసం ఇప్పటికే పోటీ నెలకొనగా.. జీహెఛ్ఎంసీ మేయర్‌ పీఠంపై మిగతావారు ఫోకస్ పెట్టారట. మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో చాలా మంది అక్కడ కర్చీఫ్‌ వేసేందుకు లాబీయింగ్‌ మొదలుపెట్టినట్టు సమాచారం.

జీహెచ్ఎంసీ మేయర్‌ పీఠం తెలంగాణలో పెద్దది. పైగా నిత్యం వార్తల్లో ఉండే పోస్ట్‌. కాలం కలిసి వస్తే రాజకీయంగా ఇంకా పైకి ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు.. మేయర్‌గా రాజధాని హైదరాబాద్‌ నగరంలో పెత్తనం చేయొచ్చు. ఇలా అనేక లెక్కలు వేసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఈసారి ఛాన్స్‌ వదులుకోకూడదని భావిస్తున్నారట. భార్య లేదా ఇంట్లో ఉన్న మహిళలను ఎన్నికల గోదాలోకి దించేందుకు అన్నిరకాల అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ చరిత్రలో ఇప్పటి వరకూ ఇద్దరు మహిళలు మేయర్‌గా పనిచేశారు. వారిలో ఒకరు సరోజిని పుల్లారెడ్డి మరొకరు బండ కార్తీక్‌రెడ్డి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన GHMC ఎన్నికల్లో మేయర్‌ పీఠం బీసీలకు రిజర్వ్‌ అయింది. ఆ విధంగా బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా ఉన్నారు. ఇప్పుడు జనరల్‌ మహిళకు కేటాయించడంతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు చాలా మంది రంగంలోకి దిగారు. గెలుపు గ్యారెంటీగా ఉండే డివిజన్‌ను చూసుకుని ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నారట.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌కు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారిలో కొందరు కీలక స్థానాల్లో ఉన్నారు. ప్రభుత్వంలో చురుకుగా పనిచేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులు అధిష్ఠానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వారంతా ఏదో విధంగా మేయర్‌ పీఠం వశపర్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఈసారి మేయర్‌ సీటు కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ తప్పదని అనుకుంటున్నారు. మరి.. పార్టీ పెద్దల ఆశీసులు ఎవరికి దక్కుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news