ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే 16 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరోవైపు… మృతుల సంఖ్య కూడా 90 వేలకు చేరువ అవుతోంది. ఇక, కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.. 30కి పైగా దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి.
లాక్‌డౌన్ కారణంగా కొందరు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకుంటుంటే.. మరికొందరేమో కుటుంబసభ్యుల సమక్షంలో కానిచ్చేస్తున్నారు. అయితే తాజాగా ఏడడుగుల బంధాన్ని వందేళ్లు గుర్తుంచుకునేలా సంబరంగా నిర్వహించుకోవాలనుకున్న ఆ జంట ఆశ కేవలం ఏడుగురు బంధువుల సమక్షంలో ముగిసిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో ఈశ్వరరావు అనే వ్యాక్తికి నిన్న వివాహం జరిగింది. అయితే సొంతూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని భారీ కల్యాణ మండపం బుక్ చేసుకోవడమేకాక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కానీ, లాక్‌డౌన్ కారణంగా వీరి ఆశలు ఆవిర అయ్యాయి. ఇక వివాహాన్ని వాయిదా వేసుకునేందుకు ఉభయ కుటుంబాలు ఇష్టపడక పోవడంతో నిరాడంబరంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ వివాహ వేడుకకు వధూవరుల తల్లిదండ్రులతో పాటు పురోహితుడు మరో ముఖ్యమైన ఏడుగురు అతిథులు మాత్రమే హాజరు కావడం గమనార్హం. ఇలా కరోనా కష్టకాలంలో పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితుల్లో వారే వందలు, వేల మంది అతిథులు అనుకుంటూ ఆ జంట పెళ్లి తంతును పూర్తి చేసుకుంది.