కోపం, ద్వేషం, పగ.. ఇవి మనుషులతో ఎంతటి దారుణమైన పనినైనా చేయిస్తాయి. కోపంలో విచక్షణ కోల్పోయిన మనిషి.. ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు. అలా ఓ విషయంలో ఎస్సైపై కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ అదును చూసి అతణ్ని అంతమొందించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?
మూడేళ్ల క్రితం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు కోపంతో రగిలిపోయిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఒకరు సబ్ ఇన్స్పెక్టర్(ఎస్సై)ను చంపిన ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో చోటుచేసుకుంది. నిందితుడు పంకజ్ యాదవ్ మూడేళ్ల క్రితం తన సహచర ఉద్యోగితో గొడవ పడిన ఘటనకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ బసవరాజ్ గార్గ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. పంకజ్కు జీతంలో కోత విధించాలని అప్పట్లో సిఫార్సు చేశారు. దీనిపై కక్ష పెంచుకున్న పంకజ్ బుధవారం రాత్రి బసవరాజ్ గదిలోకి చొరబడి కర్రతో దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. నిందితుణ్ని గురువారం అరెస్టు చేశారు.