హైదరాబాద్ లో బయటకు వెళ్లాలంటే గంటలు గంటలు ట్రాఫిక్ లో నిరీక్షణ తప్పదు. వేల సంఖ్యలో వాహనాలతో రహదారులపై రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలుసమీక్షల తర్వాత ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
రిమూవల్ ఆఫ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ ఆండ్ ఎంక్రోచ్మెంట్ – రోప్ పేరిట రూపొందించిన ఆ కార్యక్రమాన్ని సీవీ ఆనంద్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఏసమస్య వచ్చినా వెంటనే సమాచారమిచ్చేలా పోలీస్‌శాఖ డయల్ 100 అందుబాటులోకి తెచ్చింది.
ఆర్టీసీ బస్సులు బస్‌బేలోనే నిలిపేటట్లుగా. ఆటోలు ఎక్కడపడితే అక్కడ ఆపకుండా చర్యలు తీసుకోవాలని సీవీ ఆనంద్ సూచించారు. వీధి వ్యాపారులు, తోపుడుబండ్లు.. రహదారులు, ఫుట్‌పాత్‌ల పైకి రాకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ సమస్య గురించి అవగాహన కల్పిస్తూనే నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించనున్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిబ్బందిని నియమించనున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.