భూమి చుట్టూ వాతావరణంలో ఉండే ఓజోన్ పొరకు చిల్లుపడిందని, దాని వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత (యూవీ) కిరణాలు నేరుగా భూమి మీద పడి, వాటితో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని మనం చిన్నప్పుడు అనేక సార్లు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం కదా.. మానవుడు చేసే అనేక తప్పిదాల వల్లే ఓజోన్ పొర క్షీణిస్తుందని మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మాత్రం ఓజోన్ పొర క్రమంగా మళ్లీ వృద్ధి చెందుతోంది. పలువురు సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది.
మనం వాడే ఏసీలు, ఫ్రిజ్‌లు, ప్రయాణించే విమానాలు, గాలిలో కలిసే అనేక రకాల వాయువులు, రసాయనాల వల్ల వాతావరణంలోని ట్రోపోస్పియర్‌లో ఉండే ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఇలా జరుగుతోంది. అయితే గతంలో అన్ని దేశాలు ఈ విషయంపై ఒక ఒప్పందానికి వచ్చాయి. ఓజోన్ పొర నాశనానికి కారణమయ్యే ఉద్గారాలను తగ్గించాలని అన్ని దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగానే అన్ని దేశాలు ఈ విషయంపై మరింత శ్రద్ధ చూపించడం మొదలు పెట్టాయి. దీంతో ఆ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఓజోన్ పొరకు ఉన్న రంధ్రాలు పూడుకుపోతున్నాయని తేలింది.
భూమిపై ఉన్న అంటార్కిటికా మీద నేరుగా ఉన్న ఓజోన్ పొర గత కొద్ది సంవత్సరాలుగా మళ్లీ పూడుకుపోతుందని, ఇది చాలా మంచి పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. దీని వల్ల ఓజోన్ పొర కొన్ని సంవత్సరాల్లో యథాతథ స్థితికి చేరుకుంటుందని వారంటున్నారు. ఓజోన్ పొర సురక్షితంగా ఉంటే భూమి మీద ఉన్న మన వద్దకు అతినీలలోహిత కిరణాలు దరి చేరవు. అలాగే సముద్రాల్లో ప్రవాహాలు క్రమబద్దంగా ఉంటాయి. వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఏది ఏమైనా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అని సైంటిస్టులు చెబుతున్నారు..!