ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు…పార్లమెంట్‌ వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ ప్రారంభం అయినప్పటి నుంచి విపక్షాలు దూకుడుగా వ్యవహరించాయి. ప్రధాని చేస్తున్న కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని రాజ్యసభ విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అంతేకాదు విపక్ష సభ్యులు అడ్డుతగులుతూ నినాదాలు చేయడంతో… పరిచయ కార్యక్రమ పేపర్లను సభ ముందు ఉంచారు ప్రధాని మోడీ. అయితే.. దీనిపై విపక్ష సభ్యుల వ్యవహార శైలిని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, రాజ్యసభ పక్షనేత పీయూష్ గోయల్ తప్పుపట్టారు.

అలాగే వివిధ సభ్యులు ఇచ్చిన 17 నోటీసులను తోసిపుచ్చారు రాజ్యసభ ఛైర్మన్. సభ్యులు ప్రశాంతంగా ఉండి, తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చుంటే పరిశీలిస్తానని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటన చేశారు. అయినప్పటికీ విపక్ష పార్టీల సభ్యులు శాంతించలేదు. అటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం పై వెంటనే చర్చజరపాలని వెల్ లో వచ్చి పట్టుబట్టారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దీంతో సీరియస్‌ అయిన రాజ్యసభ ఛైర్మ్‌ వెంకయ్య నాయుడు సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసారు. అటు లోక్‌ సభను వాయిదా వేసినట్లు సమాచారం అందుతోంది.