కరోనా తర్వాత.. హైదరాబాద్ మెట్రోకు పునర్వైభవం

-

మెట్రోరైలుకు పూర్వకళ వచ్చింది. కొవిడ్‌ అనంతరం అత్యధిక మంది సోమవారం మెట్రోలో ప్రయాణించారు. 3.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. రెండేళ్ల అనంతరం ఆ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే మొదటిసారి. 2020 ఏప్రిల్‌కు ముందు పని రోజుల్లో సగటున ప్రతి రోజూ 4 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. ఒక్కోరోజు నాలుగున్నర లక్షల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

5 లక్షల మార్కును దాటేందుకు ఎంతోకాలం పట్టదని అంచనాలు వేస్తున్న సమయంలో.. కొవిడ్‌ రూపంలో ఊహించని పిడుగు మెట్రోపై పడింది. ఆ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో రైళ్లు డిపోలకే పరిమితం అయ్యాయి. జూన్‌ 1 నుంచి ఆంక్షలు తొలగినా.. మెట్రోపై కొనసాగాయి. 169 రోజుల అనంతరం పునఃప్రారంభమైనా.. రెండోవేవ్‌ భయంతో ఆదరణ అంతంతమాత్రంగా ఉండేది.

ప్రస్తుతం ఐటీ కార్యాలయాల్లో 35 శాతం వరకు ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయడం ఆరంభమైంది. కొద్దినెలల క్రితం వరకు ఇది పదిశాతమే ఉండేది. ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడం మొదలు కాగానే మెట్రోలోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పైగా ఇటీవల ఈ రంగంలో లక్షన్నర మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి.

సహజంగానే కొత్తతరం మెట్రోలో రాకపోకలకు ఇష్టపడుతున్నారు. దీంతో నాగోల్‌-రాయదుర్గం మార్గంలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మియాపూర్‌-ఎల్బీనగర్‌ ఏ సమయంలోనే రద్దీగా ఉంటుంది. వర్షాలు, రహదారులపై ట్రాఫిక్‌ ఇక్కట్లతోనూ మెట్రో వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొవిడ్‌ పూర్వస్థాయికి దాదాపుగా ప్రయాణికులు చేరారు.

హెచ్చుతగ్గులు.. ప్రయాణికుల ఒకరోజు సంఖ్య దాదాపు 4 లక్షల మార్కును చేరువైనా.. ఈ సంఖ్య స్థిరంగా ఉండటం లేదు. వారాంతంలో తక్కువగా ఉంటారు. హాలిడే కార్డుతో సెలవు రోజుల్లోనూ ప్రయాణికులు పెరుగుతున్నారు. ‘ప్రస్తుతం ప్రతిరోజు సగటు 3.50 లక్షల నుంచి 3.60 లక్షల మధ్యన ఉంది. ఈనెల 8న కొవిడ్‌ తర్వాత అత్యధికంగా 3.94 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదయ్యాయి’ అని ఎల్‌ అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news