తూచ్‌.. పీఎం కేర్స్‌కు ఇవ్వ‌లేదు.. వేరే విధంగా ప్యాట్ క‌మ్మిన్స్ స‌హాయం అంద‌జేత‌..

-

భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో బాధితుల‌కు కావ‌ల్సిన స‌దుపాయాల‌ను అందించేందుకు గాను ఇత‌ర దేశాలు అన్నీ ముందుకు వ‌స్తున్న విష‌యం విదితమే. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు చెందిన ఆస్ట్రేలియా ఆట‌గాడు ప్యాట్ క‌మ్మిన్స్ ఇటీవ‌లే భార‌త్‌కు స‌హాయంగా 50వేల డాల‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపాడు. అయితే ప్యాట్ క‌మ్మిన్స్ చివ‌ర‌కు ఆ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు ఇవ్వ‌లేదు.

క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాది లాక్‌డౌన్ ఆరంభంలో ప్ర‌ధాని మోదీ పీఎం కేర్స్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దానికి పెద్ద ఎత్తున విరాళాలు వ‌చ్చాయి. దేశంలో కోవిడ్‌పై పోరాటానికి కేంద్రం అందులోంచి నిధుల‌ను అప్పుడ‌ప్పుడు ఖ‌ర్చు చేస్తూ వ‌స్తోంది. అయితే పీఎం కేర్స్‌కు ఎన్ని నిధులు వ‌చ్చాయో తెల‌పాల‌ని గ‌తంలోనే కొంద‌రు ఆర్‌టీఐ ద్వారా స‌మాచారం సేక‌రించేందుకు య‌త్నించారు. కానీ ఆ వివ‌రాల‌ను కేంద్రం వెల్ల‌డించ‌లేదు. దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీల‌తోపాటు చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు.

దాత‌ల నుంచి సేక‌రించిన విరాళాలు ఎంత మేర పోగ‌య్యాయో చెప్పేందుకు ఇబ్బంది ఏముంద‌ని, చెబితే ఇంకా ఎక్కువ మంది విరాళాలు ఇస్తారు క‌దా అని, చెప్ప‌క‌పోతే దాత‌లు తాము ఇచ్చిన మొత్తం ఏ విధంగా ఖ‌ర్చు అయిందో తెలుసుకునే అవ‌కాశం లేద‌ని.. విమ‌ర్శించారు. అయితే ఆ వివాదం స‌ద్దుమ‌ణిగినా ప్యాట్ క‌మ్మిన్స్ తాజాగా పీఎం కేర్స్‌కు ఆ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ పీఎం కేర్స్ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. దీంతో చాలా మంది క‌మ్మిన్స్‌ను పీఎం కేర్స్‌కు విరాళం ఇవ్వొద్ద‌ని, ఇచ్చినా వారు ఖ‌ర్చుల వివ‌రాలు చెప్ప‌రు క‌నుక వృథా అవుతుంద‌ని కోరారు.

అయితే ఈ విష‌యంపై ఒత్తిడి వ‌చ్చినందునే, మ‌రొక కార‌ణ‌మో తెలియ‌దు కానీ ప్యాట్ క‌మ్మిన్స్ మాత్రం పీఎం కేర్స్ కు విరాళం అందించ‌ట్లేద‌ని, కానీ భార‌త్‌కు స‌హాయం చేసేందుకు యూనిసెఫ్ ఆస్ట్రేలియా ప్రారంభించిన కార్య‌క్ర‌మానికి మాత్రం ఆ విరాళాన్ని పంపించాన‌ని తెలిపాడు. ఆ కార్య‌క్ర‌మానికి విరాళం అంద‌జేసినా దాని ద్వారా భార‌త్‌కు ఎలాగూ సహాయం అందుతుంది క‌దా.. అని క‌మ్మిన్స్ అన్నాడు. దీంతో ఈ వివాదానికి తెర ప‌డింది. అయితే క‌మ్మిన్స్ విరాళాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత ప‌లువురు ఇత‌ర ప్లేయ‌ర్లతోపాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా విరాళాలు అంద‌జేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version