మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? : సత్యసాయి జిల్లా ఘటనపై పవన్ సీరియస్

-

మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదారకమని. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైరులు తెగిపడి అయిదుగురు మహిళా కూలీలు సజీవ దహనం అయిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసింది… రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటు చేసుకున్న హృదయ విదారకమైన ఈ విషాదం మనసుని కలచి వేసిందని పేర్కొన్నారు.

ఆ కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను… బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటాం మరి వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? అని ప్రశ్నించారు.

విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలి… అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయి ఉంటున్నాయి. అలాగే జనావాసాల మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు అయిదు నిండు ప్రాణాలు పోయాయి… తాడిమర్రి దగ్గర చోటుచేసుకున్న దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news