రోడ్ల గురించి మాట్లాడితే కరోనా అంటున్న ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, వాటిని పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల విషయాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, దానివల్ల ప్రజలు ఇక్కట్లు పడాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా ఏపీ రహదార్లు ఉన్నాయని, వాటిని పూడ్చి సరైన రోడ్లు వేయకుండా గుంతలను గొయ్యిలుగా మార్చి, గొయ్యిలను కాలువలుగా చేస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసారు.

రోడ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని, అప్పటి వరకూ జనసేన ప్రశ్నిస్తూనే ఉంటుందని, రోడ్లు బాగయ్యేంత వరకు జనసేన తన పోరాటాన్ని ఆపదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మాట్లాడితే కరోనా అంటున్నారని, గత సంవత్సరం రొడ్లు బాగుచేయించకుండా ఏం చేసారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం టీడీపీ కూడా రహదారుల విషయంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి వీటిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.