జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత ఇటీవల ప్రారంభమైంది. అయితే.. నేడు వారాహి విజయ యాత్ర ఏలూరు జిల్లా తణుకు చేరుకుంది. తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. క్షమాపణలతో తణుకు సభ ప్రారంభిస్తున్నానని తెలిపారు. విడివాడ రామచంద్రరావుకు నా క్షమాపణలు… ఇక్కడ జనసేన సీటు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు లేరు… పార్టీ వదిలి వెళ్లిపోయారు… కానీ సీటు ఇవ్వకపోయినా రామచంద్రరావు పార్టీతోనే ఉన్నారు… పార్టీ కోసమే ఉన్నారు… అంటూ పవన్ వివరించారు.
తణుకులో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తనకు ప్రేరణ అని వెల్లడించారు. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం తనకెంతో ఇష్టమని తెలిపారు. నాడు జనసేన ఆవిర్భావ సభలో తన తొలి పలుకులు తిలక్ కవిత్వమేనని వివరించారు. ఇక, గుణం లేనివాడే కులం గొడుగు పడతాడని జాషువా ఆనాడే చెప్పారంటూ పవన్ కల్యాణ్ విమర్శల పర్వం ప్రారంభించారు.
జగన్ కొంపలంటిస్తే… పవన్ గుండెలంటిస్తారు. జగన్ 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారు. జగన్ అధికారంలోకి రాగానే 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. జగన్… నువ్వు భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు దోచుకున్నావు. జగన్… నువ్వు ఇంటి పన్ను రూ.650 పెంచావు. నీ చెత్త పాలన వచ్చాకే చెత్తపై పన్ను వచ్చింది. కనీసం తణుకులో డంపింగ్ యార్డ్ కట్టలేని వాడివి చెత్తపై పన్ను వేస్తావా? జగన్… నువ్వు మందుబాబుల పొట్టకొట్టి రూ.30 వేల కోట్లు దోచేశావు. అన్ని రేట్లు పెంచేశావు కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నావా జగన్? నీ పాలన ఏ మాత్రం బాగా లేదు జగన్… నువ్వు నొక్కని బటన్ ల సంగతి ఏంటి? తణుకులో రూ.309 కోట్ల టీడీఆర్ స్కామ్ అంటున్నారు… దీనిపై ఏం చెబుతావు? ఇక్కడ జరిగిన స్కాంపై ఏసీబీ అధికారులు విచారణకు వస్తే నేతలు తప్పించుకుని, కమిషనర్ ను పట్టించారు. సీపీఎస్ రద్దు చేస్తానని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చి, కనీసం జీతాలు కూడా ఇవ్వడంలేదు. ఉద్యోగుల పీఎఫ్ నిధుల కూడా మళ్లించేశావు. అప్పట్లో కాగ్ పట్టుకుంటే సాంకేతిక తప్పిదం అని తప్పించుకున్న దొంగవి నువ్వు జగన్. కార్పొరేషన్ల నిధులు తీసుకుని అమ్మఒడి, వాహనమిత్ర పథకాలకు ఖర్చు చేస్తున్నాడు. కార్పొరేషన్ నిధులు మీకోసమే ఖర్చు పెట్టానంటాడు… ఖర్చు చేయాల్సిన నిధులు తాను తరలించుకుంటాడు. ఈ మాత్రానికి వాటికి నవరత్నాలు అని పేరుపెట్టడం ఎందుకు?