ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న జనసేన బీజేపీ ఏపీలో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలనే అభిప్రాయంలో ఉంటూ వచ్చాయి. ఈ మేరకు ఉమ్మడిగా ప్రజా పోరాటం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ టిడిపి వైసీపీలను ఇబ్బంది పెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలనే అభిప్రాయంతో ఉంటూ వచ్చాయి. కానీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి బిజెపి పెద్దగా తమను పట్టించుకోనట్టుగా ఉండడం, సొంతంగా ఏపీలో ఎదిగేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కనీసం కలిసి ముందుకు వెళ్లకపోవడం, వంటి పరిణామాలు పవన్ కు చాలాకాలంగా ఆగ్రహం కలిగిస్తున్నాయి. అన్ని అవమానాలను భరిస్తూనే పవన్ మౌనంగా ఉంటూ వస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో బిజెపి, జనసేన కార్యకర్తలు ఒకరితో ఒకరు కలిసి వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడం, అసలు క్షేత్ర స్థాయిలో బలమే లేని బిజెపితో పొత్తు పెట్టుకుని ఇన్ని ఇబ్బనులు ఎదుర్కునేకంటే సొంతంగా బలం పెంచుకోవడం మంచిదనే అభిప్రాయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉండగా, పవన్ మాత్రం బీజేపీ అండదండలు ఉంటే రాజకీయంగా మేలు జరగడంతో పాటు, ఆర్థికంగా పార్టీ అండదండలు ఉంటాయని, రాజకీయ వ్యూహాలను సులువుగా అమలుచేయవచ్చు అనే అభిప్రాయంతోనే ఎటువంటి షరతులూ పెట్టకుండానే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారు.
కానీ బీజేపీ మాత్రం జనసేన ను పూర్తిగా పక్కనపెట్టిసినట్టుగా వ్యవహరిస్తూ వస్తుండడంతో పాటు, ప్రస్తుతం తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పాటు, క్యాబినెట్ మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధం అవుతుండడం, ముందు ముందు వైసీపీకి ప్రాధాన్యం పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, ఈ పరిణామాలన్నీ పవన్ కు ఎక్కడలేని ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఇష్టం లేకుండా బలవంతంగా బీజేపీతో కలిసి వెళ్లేకంటే ఒంటరిగానే ఏపీలో బలోపేతం అవ్వడంపై దృష్టిపెడితే బాగుంటుంది అనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
అలాగే తమకు పదేపదే ఆహ్వానాలు పంపుతున్న తెలుగుదేశం పార్టీతోనూ కలిసి ముందుకు వెళ్లడం మంచిదనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా వైసిపి బీజేపీ పొత్తు అధికారికంగా ఖరారు అయిన తర్వాత మాత్రమే స్పందించాలనే అభిప్రాయంతో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
-Surya