చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. సరిగ్గా సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అయితే దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ.. చంద్రయాన్ 3 లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టమని అన్నారు.
‘‘ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను సజీవంగా మోస్తూ.. చంద్రయాన్ 3లో భాగమైన విక్రమ్ లాండర్ చందమామపై అడుగుపెట్టడం అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఒక ముఖ్య ఘట్టం. ఇంతటి విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలు సర్వదా అభినందనీయులు. ఇస్రో బృందానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు.