ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఉందా? అంటే ఉన్నట్లే ఉంది గాని..లేదు అని చెప్పవచ్చు. అదేంటి క్లారిటీ లేకుండా అని అనుకోవచ్చు. వాస్తవానికి వారి పొత్తు కూడా క్లారిటీ లేకుండానే ఉంది. పేరుకు పొత్తు ఉంది గాని ఏనాడూ కలిసి పనిచేయలేదు. ఈ మధ్య వారికి మరింత గ్యాప్ పెరిగింది. ఇక పవన్ ఏమో టిడిపితో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయినట్లు కనిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్…ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంపై ఉత్కంఠ మొదలైంది. ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెనుక నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో మంతనాలు జరిపారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాలతో చర్చించే అవకాశాలున్నాయి. ఈ చర్చల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే బిజేపితో కలిసి వెళ్లాలా..లేక టిడిపితో పొత్తుకు రెడీ అవ్వాలనేది తేలనుంది.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తమ పార్టీ సహకారం కూడా కోరలేదని పవన్..బిజేపి పెద్దలతో చెప్పే ఛాన్స్ ఉంది. అలాగే కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు.. జగన్‌తో కుమ్మక్కయ్యారని, కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రనేతలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే కేంద్రంలోని పెద్దలు సైతం జగన్‌కు అండగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
అదే సమయంలో పవన్‌ని కర్ణాటక ఎన్నికల్లో బిజేపి తరుపున ప్రచారం చేయించుకునేందుకు ఢిల్లీకి పిలిచారనే చర్చ ఉంది. పవన్ కు కర్ణాటకలో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో అక్కడ ఆయన్ని బిజేపి తరుపున ప్రచారానికి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరికి పవన్ తో బిజేపి ఎలాంటి స్కెచ్ వేయనుందో.