దేశం కోసం చనిపోయినపోయిన అమరవీరులకు అంజలి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు. “దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు”.. అంటారు శ్రీ భగత్ సింగ్. స్వర్గీయ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ విషయంలో ఈ పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయి. మరణించి అమరులైనా నిరాకారంతో మన మధ్య జీవిస్తూనే ఉన్న వీరు చిరంజీవులు. సరిగ్గా ఇదే రోజున అంటే.. మార్చి 23, 1931న ఈ ముగ్గురు వీరులు దేశమాత దాస్యశృంఖలాలను తెంచడానికి లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారని వెల్లడించారు.
పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే ఈ ముగ్గురూ దేశంలో రగిలించిన స్వతంత్ర కాంక్ష, విప్లవాగ్ని పరాయి పాలకులు దేశం నుంచి పారిపోయేంత వరకు జ్వలిస్తూనే ఉన్నాయి. ఈ పుణ్య తిథి నాడు ఆ అమరవీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఈ వీరుల బలిదానాలను స్మరించుకోడానికి ఏటా ఈ రోజున షహీద్ దివస్ (అమరుల సంస్మరణ) నిర్విహించుకుంటున్నాము. అయితే ఇది మాత్రమే సరిపోదని నా భావన. ఈ మహానీయులను నిత్యం స్మరించుకోవాలి. అందుకు తగిన విధంగా ఈ వీరుల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాలి. స్మారక స్తూపాలు నెలకొల్పాలి. వీరి చరితను చిరంతనంగా మన యువతకు అందించాలి. జాతిని నిత్యం జాగృతం చేయాలి. చివరిగా.. “నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరు” అంటారు భగత్ సింగ్. నిజమే- ఈ వీరుల ఆలోచనలు, భావ గాఢత దేశభక్తుల మదిలో పదిలంగా ఉన్నాయని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.