ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన(janasena)జనంతోనే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొవిడ్ బారినపడి మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. అలానే నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారని విచారం వ్యక్తం చేసారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారని అన్నారు.
ప్రాణాలను పణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కరోనాతో జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని తెలిపారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించామని, ఈ భీమా పథకానికి తన వంతుగా కోటి రూపాయలు ఇచ్చినట్లు పవన్ చెప్పారు. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. ప్రజా స్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ప్రస్తుత పరిస్థితి లో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య అని అయినప్పటికీ ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని అన్నారు. అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామని పవన్ పిలుపునిచ్చారు.