మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కీలక స్మగ్లర్లను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మత్తుమాఫియాతో సంబంధాలున్న డ్రగ్స్ డాన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్(61)పై నగర పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు.
గోవాలో హిల్‌టాప్ పబ్‌ను నడిపిస్తున్న డిసౌజా దాదాపు 40 ఏళ్లుగా మాదకద్రవ్యాల దందా నడిపిస్తున్నాడు. గతేడాది సెప్టెంబరులో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్.న్యూ), ఓయూ పోలీసులు..డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రీతేష్ నారాయణ్ బోర్కర్‌ను అరెస్ట్ చేశారు. అతడి ద్వారా రాబట్టిన సమాచారంతో స్టీఫెన్ డిసౌజా పేరు బయటకు వచ్చింది.
ఇతడు గోవా వచ్చే పర్యాటకులు, యువత లక్ష్యంగా మత్తుపదార్థాలు విక్రయించేవాడు. ప్రత్యేకంగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొకైన్, హెరాయిన్‌ను చేరవేసి సొమ్ము చేసుకునేవాడు. గోవాలో దాగిన డిసౌజాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా పీడీయాక్ట్ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.