దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో రిసీవ్ చేసుకునే సంస్కారం, మర్యాద లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు రాజ్యాంగం మీద విశ్వాసం లేదని, రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కారం లేదని విమర్శించారు. సీఎం కుర్చీ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఉందన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆ కుర్చీని సొంత జాగీరుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఉందని తెలిసే కావాలనే హైదరాబాదులో తన ముఖమే కల్పించాలని అహంకారంతో ప్రజల సొమ్ము రూ. 33 కోట్ల ప్రజాధనాన్ని యాడ్స్ రూపంలో ఏర్పాటు చేశారని ఆరోపించారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను సైడ్ ట్రాక్ చేయాలనే హడావుడిగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రప్పించారని విమర్శించారు. కెసిఆర్ కుట్రలను, కుటిల బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందన్నారు.