వైసీపీ వర్సెస్ జనసేన.. బ్రో సినిమా రిలీజ్‌తో మొదలైన వివాదం.. కంటిన్యూ అవుతూనే ఉంది. బ్రో సినిమాలో పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ అగ్గి రాజేసింది. అచ్చం మంత్రి అంబటి రాంబాబును పోలి ఉండటంతో రచ్చమొదలై రెమ్యునరేషన్ వరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా.. ఈడీ వరకు కూడా ఈ వ్యవహారం చేరింది. ఈ వివాదం సద్దుమణగకముందే.. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత ఆజ్యం పోశాయి. ఇవాళ పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే 10 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయినా పర్వాలేదు అనే రౌడీయిజం చంద్రబాబు చేస్తున్నారని, పోలీసుల పై దాడులు చేసి అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నాడని పేర్ని నాని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర పన్నాడు చంద్రబాబు అని, చంద్రబాబుది శకుని మెదడంటూ ఆయన మండిపడ్డారు. టీడీపీకి మరోసారి వాత పెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని అన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పేర్ని కౌంటర్ ఇచ్చారు. దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుందని, చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఎప్పుడైనా అడిగారా?? అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి నా అభిమాన నటుడు అని వ్యాఖ్యానించారు పేర్ని నాని.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారు? అని ఆయన ప్రశ్నించారు.