ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి టీడీపీ, జనసేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. దొరకనంత వరకు అందరూ దొంగలేనని, వీరప్పన్ తాను దొరికిన తర్వాత మీలాగే తాను దొంగను కాదని చెప్పారని చురక అంటించారు. తానేదో అడవికి న్యాయం చేస్తున్నట్లు వీరప్పన్ చెప్పుకున్నాడన్నారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల తర్వాత దొరికారన్నారు. మీరు అంత నిజాయతీపరులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
పవన్ ఐదు రోజుల పాటు కృష్ణాలో ఆటవిడుపు యాత్ర చేశారని, ఆయన మాటలు జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదన్నారు. జగన్‌కు దమ్ముందని, అందుకే ఏ పార్టీతోనూ పొత్తుతో వెళ్లడం లేదన్నారు. పవన్ లా జగన్ రోజుకో పార్టీ మార్చరన్నారు. అవనిగడ్డలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చెప్పిన జనసేనాని, ముదినేపల్లిలో తిరిగి అందులోనే కొనసాగుతున్నట్లు చెప్పారన్నారు. వైఎస్సార్ పై పవన్ కల్యాణ్ ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. తనకు బీజేపీ కంటే చంద్రబాబు ముఖ్యమని పవన్ తేల్చేశారన్నారు. జగన్‌పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు.
పవన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. అసలు ఆయనకు ఏపీలో ఆధార్ కార్డు ఉందా? ఇల్లు ఉందా? అని నిలదీశారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం పేరును పవన్ చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్‌లు ఏపీకి పట్టిన మహమ్మారి అన్నారు.