రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు జాతికి అంకితం

-

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

అలాగే కేరళలో 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును అంకింత చేసిన ప్రధాని, రాజస్థాన్‌లో 735 మెగావాట్ల ప్రాజెక్ట్​, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. విద్యుద్దీకరణతో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని సౌరవిద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్టీపీసీ యాజమాన్యం జలాశయంపై రూ.423 కోట్లతో 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించింది. రెండేళ్లపాటు నిర్మాణ పనులు సాగాయి. దాదాపు 500 ఎకరాల జలాశయం నీటిపై సౌర విద్యుత్తు కేంద్రం నిర్మాణం చేపట్టారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి చేపడ్తున్నారు. హెచ్‌డీపీఈ(హై డెన్సిటీ పాలీఇథలిన్‌)తో తయారు చేసిన ఫ్లోటర్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.

జులై 1న 100 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని వాణిజ్యరంగంలోకి తీసుకువచ్చారు. సాధారణ ఎండలో రోజుకు 5 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 2 లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి అందిస్తుండగా, మిగతా 3 లక్షల యూనిట్లను విపణికి సరఫరా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news