ఆజాద్ పై మోడీకి అంత ప్రేమ అందుకేనా

-

ఇందిరాగాంధీ నుండి, మన్మోహన్ సింగ్ వరకు..అందరికీ కావలసినవాడే..వాజ్‌ పేయి నుండి, మోడీ వరకు అందరికీ దగ్గరైన వాడే. కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో ఇందిర నుంచి మొదలు పెట్టి అందరి కేబినెట్ లలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు..ఎప్పుడో 1970ల తొలినాళ్లలో మొదలైన ప్రస్థానం 2021 వరకు.. అంటే ఐదు దశాబ్దాలుగా విరామం లేకుండా సాగుతూనే ఉంది. రాజకీయాలు చిక్కుముడిలో పడినప్పుడు కూటములు కట్టి, రాజకీయ రాయబారిగా సయోధ్య చేసి కొత్త వేదికలు, కొత్త సమీకరణాలకు తెరలేపిన నేర్పు ఆజాద్ కే సొంతం…

యూనివర్సిటీ మెట్లు దిగుతూనే, రాజకీయాల్లోకి పెద్ద అంగ వేశారు అజాద్. కాంగ్రెస్ యువనేతగా రాజకీయాల్లో అడుగుపెట్టి, 1980లో ముప్పై ఏళ్లకే ఎంపీగా, కేంద్రమంత్రిగా ఎదిగారు. అప్పటినుండి 2021 వరకు అజాద్… ఏదో ఒక పదవిలోనో, పార్టీకి సంబంధించిన ఏదో ఒక బాధ్యతలోనో కొనసాగుతూనే ఉన్నారు. గులామ్ నబీ ఆజాద్ అనగానే సంక్షోభాలను చిరునవ్వుతో ఎదుర్కొనే నేత గుర్తొస్తాడు. పెద్దరికం, చాకచక్యం రెండూ కలిసి సమస్యలను చక్కబెట్టే నేర్పు కనిపిస్తుంది.

మైనారిటీ నేతలు, ముఖ్యంగా ముస్లిం నేతలు ఛాందసంగా ఉంటారనే అపోహను ఆజాద్ తొలగించారు. ప్రజాస్వామిక వాదిగా, కాంగ్రెస్ వాదిగా ఆయన పారదర్శకమైన జీవితాన్ని గడిపారు. ఏ పార్టీ దగ్గరకైనా, ఏ నేత దగ్గరకైనా ఎప్పుడైనా వెళ్లగల చొరవ ఆజాద్ కి ఉంది. చివరి రోజుల్లో పార్టీని విమర్శించారని కామెంట్లు వచ్చాయి.కానీ, అందులో కుప్పకూలుతున్న పార్టీని నిలబెట్టాలనే తపన కూడా ఉందని చెప్పాలి.గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్ లో ఎక్కడో గ్రామ రాజకీయాల్లో మొదలై ఢిల్లీలో అత్యున్నత స్థానం వరకు ఎదగటంలో ఈ లక్షణాలే కీలకం.

తొలినాళ్లలో సంజయ్ గాంధీ హవా సాగుతున్న కాలంలో ఆయనకు సన్నిహితుడిగా మారిన ఆజాద్, 1977లో దోడా జిల్లా కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఆలిండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. మరో మూడేళ్లకి ఆలిండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు.ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత విధేయునిగా ముద్రపడిన ఆజాద్, అదే సమయంలో పివినరసింహారావు, సీతారాం కేసరి లాంటి నేతలకు కూడా నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవటం చిత్రమైన విషయం.

ఆజాద్‌ అందరివాడు అనటానికి పెద్ద ఉదాహరణగా, ఆయన వీడ్కోలు సమావేశం జరిగిన తీరే చెప్తుంది. రాజ్యసభలో నలుగురు సభ్యుల పదవీ కాలం ముగియటంతో, వారి వీడ్కోలుపై సభలో చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ సభ్యుడు గులామ్ నబీ ఆజాద్ గురించి మాట్లాడినంత సేపూ మోదీ భావోద్వేగంతోనే ప్రసంగాన్ని సాగించారు. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆజాద్ సేవలను ప్రధాని కొనియాడారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని వ్యాఖ్యానించారు.

ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆజాద్ పనితీరును అందుకోవడం చాలా కష్టమని కితాబిచ్చారు ప్రధాని మోడీ. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్ కోసం ఆయన పనిచేశారని అన్నారు. ముఖ్యంగా కశ్మీర్లో ఓసారి ఉగ్రదాడి జరిగినప్పుడు గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకుని పోయిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆజాద్‌ తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంతగా శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగానికి గురయ్యారు.

ఆజాద్‌ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, ఇద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నామని మోడీ అన్నారు. ఆజాద్‌ క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారని, ప్రకృతితో మమేకమౌతారని, ఉద్యానవనాల విషయంలో ఆయనకు అపార పరిజ్ఞానం ఉందన్నారు. పదవులు వస్తూ పోతుంటాయి. కానీ, వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి నేర్చుకోవాలన్నారు మోడీ.

విపక్షం నుంచి ఈ స్థాయిలో ప్రశంసలు రావటం భారత పార్లమెంట్‌ చరిత్రలో అరుదైన ఘటన. సాక్షాత్తూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకుని తమ స్నేహాన్ని ప్రస్తావించటం, తన అభిప్రాయాలు వెలిబుచ్చటం ఆశ్చర్యకరమైన విషయం. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ లో ఉంటూ కూడా బిజెపి నేతల నుండి అభినందనలు అందుకోవటం సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆజాద్‌ ను రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. తాము నామినేట్ చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news