బల్దియా పీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగరేసింది. ఎంఐఎం సహకారంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని ఈజీగా గెలుచుకుంది. మొన్నటి వరకు ఎక్స్ అఫిషియో లెక్కలేసిన అన్ని పార్టీలకు షాకిస్తూ ఎంఐఎం ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ కి మద్దతిచ్చింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ సైతం వద్దంటు టీఆర్ఎస్ కి ఎంఐఎం మద్దతివ్వడం గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.
గ్రేటర్ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయిన టీఆర్‌ఎస్.. వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎక్స్ అఫిషియో మెంబర్ల మద్దతుతో బల్దియా పీఠం కైవసం చేసుకుంటుందని అనుకున్నప్పటికీ.. ఆ అవసరం లేకుండానే ఎంఐఎం సపోర్టుతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని దక్కించుకుంది. గ్రేటర్ లో 150 మంది కార్పొరేటర్లకు గాను టీఆర్‌ఎస్‌కు 56, బీజేపీకి 48 మంది కార్పోరేటర్లు ఉన్నారు. అయితే బీజేపీ కార్పోరేటర్ ఒకరు చనిపోవడంతో.. ఆ పార్టీ బలం 47కే పరిమితమైంది. ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పోరేటర్లు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం జరిగిన ఎన్నికలో ఎంఐఎం.. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ పదవిని టీఆర్‌ఎస్ ఆఫర్ చేసినప్పటికీ.. దాన్ని సున్నితంగా తిరస్కరించింది ఎంఐఎం.
అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో టీఆర్ఎస్ కి స్నేహ హస్తం అందించింది.టీఆర్‌ఎస్,ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ నడుస్తుంది.
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు.మేయర్ ఎన్నికకు ముందు జీహెచ్‌ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారానికి అనుమతిచ్చారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.
ఒకేసారి ఇద్దరు మహిళలకు మేయర్, డిప్యూటీ మేయర్‌గా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపంవద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసారు. పదవుల్లో ఉన్నవాళ్లు సహనం, సంయమనం పాటించాలని వారికి సూచించారు సీఎం కేసీఆర్.