విశ్వ మానవ కల్యాణం అన్నది సాధ్యం సమానత్వంతోనే సాధ్యం.కులమతాలకు అతీతంగా రామానుజాచార్యుల స్ఫూర్తితో పనిచేస్తే ఇంకా సులువు. జగద్గురు రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భాన రాముడిలానే ఆయన కూడా సద్గుణ శీలి అని చినజియర్ స్వామీజీ ప్రసంగిస్తూ మోడీని ప్రశంసించారు. రామ తత్వంలో ఉన్న గుణాలను ఆయన కూడా పుణికి పుచ్చుకున్నారు అని ఆత్మీయ వచనం అందించి సభికులను అలరించారు. ఇదే సందర్భంలో మోడీ తనదైన శైలిలో మాట్లాడి అంబేద్కర్ రాజ్యాంగ రచనకూ రామానుజాచార్యులే స్ఫూర్తి అని కాసింత ఆసక్తిదాయక వ్యాఖ్యలే చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం యమునా తీరాన నెలకొల్పి ఐక్యతకు ప్రతీకగా మార్చామని, అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా సమానతకు ప్రతీకగానూ ప్రతినిధిగానూ ఉంటుంది అని స్పష్టం చేస్తూ..మోడీ భారతీయతలో ఉన్న గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నించారు.
గురువే జ్ఞాన కాంతిని అందిస్తారు.గురువే గొప్ప స్ఫూర్తికి ఆనవాలు అవుతారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ చెప్పిన మాటల అర్థ స్ఫూర్తి ఇది. వసంత పంచమి రోజున భాగ్యనగరికి విచ్చేసిన మోడీ ఆద్యంతం భారతీయతలో ఉన్న గొప్పదనాన్ని తన ప్రసంగం ద్వారా వినిపించి ఆశ్రమంకు వచ్చిన వారికీ, దేశ వ్యాప్తంగా ఆయన ప్రసంగం వింటున్న వారికీ
ఆధ్యాత్మికతో ఉన్న విశిష్ట లక్షణం వివరణలోకి వచ్చే విధంగా మాట్లాడారు.విశేషించి మాట్లాడారు.
ఇవాళ తెలంగాణ వాకిట అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది.సమతా మూర్తిగా పిలుచుకునే జగద్గురు రామానుజా చార్యుల విగ్రహాన్ని దేశప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అటుపై ఆయన ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.సమానతకు, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే ఈక్షేత్రం రానున్న కాలంలో వర్థిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమానత్వంకు ప్రతీకగా కుల మతాలకు అతీతంగా వెయ్యేళ్ల కిందట ఆధ్యాత్మిక ప్రబోధను ఆచరణ మార్గంలోకి తీసుకువచ్చిన శ్రీరామానుజాచార్యుల కీర్తిని కొనియాడారు.