పోలవరంపై తెలుగు రాష్ట్రాల వాడీవేడి చర్చ.. మళ్లీ కుదరని అభిప్రాయాలు

-

హైదరాబాద్‌లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ 15వ సమావేశం వాడీవేడిగా సాగింది. సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 15 అంశాలపై ఆ సమావేశంలో చర్చించారు. పోలవరం వెనుక జలాలకారణంగా భద్రాద్రి జిల్లాలో సంభవించే ముంపుపై తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా కొన్ని వివరాలు సమర్పించింది.

పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల డ్రైనేజీ వ్యవస్థతోపాటు, గోదావరికి ఇరువైపులా చాలానష్టం జరుగుతోందని వివరించింది. పోలవరంలో కనీస నీటిమట్టం ఉన్నపుడు భద్రాచలం వద్ద 28 అడుగుల కంటే ఎక్కువగా ఏడాదిపాటు నీరు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు భద్రాచలం వద్ద తొలిప్రమాద హెచ్చరికస్థాయిలో నీరు ఉంటుందని వెల్లడించింది. తద్వారా భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లోని 6 గ్రామాల్లో 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని పేర్కొంది. ఆ సమస్యను అధిగమించేందుకు నిరంతరం నీటినితోడాల్సి ఉంటుందని ఇందుకు సుమారు 45 కోట్లు ఖర్చవుతుందని సర్కార్‌ వివరించింది.

బ్యాక్‌వాటర్‌ ప్రభావానికి సంబంధించిన మ్యాపులు, ఇతర వివరాలు వివరాలు పరిశీలించాలని రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్‌ కోరగా ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అంగీకరించలేదని తెలిసింది. గతంలో ఆ జిల్లా కలెక్టర్‌గా పనిచేశానని, అన్ని వివరాలు తనకు తెలుసని… అదనంగా ఎలాంటి ముంపు ఉండబోదని మ్యాపు చూడటానికి నిరాకరించడంతో రాష్ట్ర ఇఎన్సీ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఐతే వేరే సమావేశం ఉన్నందునే వెళ్లిపోయినట్లు పీపీఏ సీఈఓకు ఆయన ఫోన్‌లో చెప్పినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news