ఓవైపు ఏపీ హైకోర్టు అమరావతి రైతుల పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేసింది. మరోవైపు పసలపూడి వద్ద అమరావతి రైతుల పాదయాత్రలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెప్పడంతో ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో పలువురు రైతులు, ఐకాస నేతలకు గాయాలయ్యాయి.
ఇవాళ ఉదయం రాయవరంలో ప్రారంభమైన యాత్ర .. మధ్యాహ్నం భోజన విరామ సమయానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడికి చేరుకుంది. భోజనం చేసిన తరువాత రైతులు యాత్ర ప్రారంభించగానే పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని రామచంద్రాపురం డీఎస్పీ ఎం.బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది.
ఇన్నాళ్లుగా యాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడం ఏంటని రైతులు ప్రశ్నించారు. పోలీసులు వారిని ముందుకు కదలనివ్వలేదు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ రైతులను పోలీసులు నెట్టివేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అయినా రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ముందు కదిలే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు మాత్రం ఐడీ కార్డులు చూపించిన తర్వాత మాత్రమే ముందుకు సాగాలని తేల్చి చెప్పారు.