మాటలు – చేతలు: “టీడీపీ రహిత రాజధాని”కి స్కెచ్ ఇదే!

-

గుంటూరు – కృష్ణా జిల్లాలలో వైకాపా కనుమరుగైపోతుందని.. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంవల్ల రాష్ట్రం మొత్తం ఆనందడోలికల్లో ఊగిసలాడిందని.. మిగిలిన ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ… ఈ రెండు జిల్లాల్లో మాత్రం వైకాపా జెండా ఎగరదన్న రేంజ్ లో బాబు గతంలో “మాటలు” చెప్పుకొచ్చారు. కానీ… జగన్ కలల రాజధానో లేక మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానో.. రాజధాని హోదా దక్కించుకోబోతోన్న విశాఖలో పసుపురంగు కనిపించకుండా చేయడానికి స్కెచ్ లు రెడీ అయిపోయాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.

అవును… విశాఖపట్నంలో పసుపు జెండాలు కనిపించే అవకాశాలు దాదాపుగా కనుమరుగుచేసే ప్రయత్నాలు అటు వైకాపా – ఇటు బీజేపీలు స్టార్ట్ చేశాయని, ఈ విషయంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! విశాఖలో టీడీపీకున్న నలుగురు ఎమ్మెల్యేల్లో, మాజీ మంత్రుల్లో కీలకంగా ఉన్నది గంటా శ్రీనివాస రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు! వీరిద్దరిని వైకాపా – బీజేపీలు పంచుకోబోతున్నాయని… గంటా వైకాపాలోకి వెళ్తుంటే.. అయ్యన్న బీజేపీలో చేరిపోతారని అంటున్నారు!

ఇప్పటికే “తమదే ఆలస్యం” అన్న రేంజ్ లో గంటా కొత్త జెండాలు రెడీ చేయించేసుకుని మరీ రెడీగా ఉన్నారు. జగన్ మూడురాజధానుల నిర్ణయంపై చంద్రబాబు అల్లల్లాడిపోతుంటే.. ఆయాసపడే ఈ వయసులో కూడా ఆవేశపడిపోతుంటే… గంటా మాత్రం జగన్ నిర్ణయానికి బాహాటంగానే మద్దతు పలికారు! ఇదే క్రమంలో తాన రేంజ్ కి వైకాపాకు ఒక్కడినే వెళ్తే బాగోదని భావిస్తూ…ఆయనతో పాటు ఒకరిద్దరిని తీసుకుపోబోతున్నారని అంటున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… ఈ సమయంలో గంటా వైకాపాలో చేరడానికి “ఆయన కారణాలు” ఏమైనా కానీ… ఆయన చెప్పబోయే మాట మాత్రం… “విశాఖ అభివృద్ధి కోరుతూ వైకాపాలోకి వెళ్తున్నాని”! ఎవరు నమ్మినా నమ్మకపోయినా గంటా చెప్పబోయేది ఇదే!

ఇక అయ్యన్నపాత్రుడు కూడా ఇప్పటికే కాషాయ రంగు చొక్కాలకోసం షాపింగ్ చేస్తున్నారని అంటున్నారు! బీజేపీ నుంచి ఒక మోస్తరు సంకేతాలు వస్తే చాలు.. సై సై అంటూ దూకేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో సోము వీర్రాజుకు అందుబాటులోకి వెళ్లారని… ఫోన్ రింగ్ అయ్యిందా.. అయినా కూడా సోము లిఫ్ట్ చేయ్యలేదా.. లేక కాల్ బ్యాక్ చేసి కన్ ఫాం చెప్పేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో గంటాను ఫాలో అవుతున్న అయ్యన్న… తానుకూడా ఒంటరిగా వెళ్లడం ఏమిటని భావిస్తూ.. మరొకరిని అయినా వెంటపెట్టుకుని వెళ్లబోతున్నారంట!

ఇదే జరిగి.. వైకాపా మరికొన్ని చక్రాలు తిప్పితే.. ఆపరేషన్ ఆకర్ష ను మరింత పక్కాగా అమలుచేస్తే.. రాజధాని ప్రాంతంలో టీడీపీ కనుమరుగయ్యే విషయం జగన్ “చేతల్లో” చూపించే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! బాబు చెప్పారు.. జగన్ చేసుకుపోతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news