ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష టిడిపి పట్టుబట్టింది. ప్రశ్నోత్తరాల సమయం తరువాత మాట్లాడుతామని స్పీకర్ ప్రకటించారు. అయినా వినకుండా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారింది అంటూ టిడిపి సభ్యులు సభలో నినాదాలు చేశారు.
దీంతో టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, సభను అడ్డుకోవాలని ఒక అజెండాతో టిడిపి నేతలు వచ్చారని ఆరోపించారు వైసిపి నాయకులు. మరోవైపు నిరుద్యోగంపై మాట్లాడే హక్కు టిడిపి నేతలకు లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. నిజమైన రాజకీయ నిరుద్యోగులు చంద్రబాబు అండ్ కో అని మంత్రి ఆరోపించారు. టిడిపి నేతలకు దమ్ము లేదని, అందుకే చర్చకు భయపడి సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శవయాత్ర జరుగుతుందని.. అందులో పాల్గొనాలని పరోక్షంగా అమరావతి రైతుల యాత్రను ఉద్దేశించి మంత్రి చెప్పారు.