అనంతలో మళ్లీ రక్తచరిత్ర ..పరిటాల పాత చరిత్ర తవ్వడం వెనక వ్యూహం ఉందా ?

-

అనంతపురం కరువు ప్రాంతాలున్న జిల్లానే కాదు.. ఒకప్పుడు కరుడుగట్టిన ఫ్యాక్షన్‌ గొడవలకు అడ్డా. ఆధిపత్యం కోసం, రాజకీయంగా ఎదిగేందుకు ఇక్కడ జరిగిన రక్తపాతం.. ఒక చరిత్ర. అయితే ఆ చరిత్ర ముగిసిపోయి చాలా ఏళ్లు అయింది. ఇప్పుడు మారిన మనుషులు కనిపిస్తున్నారు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. కానీ.. రాజకీయ నాయకులు మాసిపోయిన ఆ గాయాన్ని మళ్లీ రేపుతన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. అనంతపై అంటుకున్న రక్తగాయాలను గుర్తు చేయడం ఇప్పుడు సీమ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నీరు ఎవరు ఇచ్చారు.. ఎవరు తెచ్చారన్న దగ్గర వివాదం మొదలైంది. అది అవినీతి ఆరోపణల దాకా వెళ్లింది. ఇది చాలదన్నట్టు దశాబ్దాల క్రితం ముగిసిన రక్తచరిత్ర అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈనెల 9న రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు రిజ్వాయర్ల భూమిపూజ సందర్భంగా మొదలైంది అసలు గొడవ. రిజర్వాయర్ల నిర్మాణానికి చెందిన పైలాన్‌ను సీఎం జగన్ వర్చువల్ ద్వారా ఆవిష్కరించారు. నాటి సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మాజీ పోలీస్ అధికారి పేల్చిన మాటల తూటాలు.. ఫ్యాక్షన్ భూతం గురించి జిల్లా ప్రజలు మళ్లీ చర్చించేలా చేశాయి.

దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవిని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ మాధవ్‌. రాప్తాడులో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారని ఆరోపించారు మాధవ్‌. ఈ కామెంట్స్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు తెస్తే సహకరిస్తాం కానీ.. మాటలు జారితే ఊరుకోబోమని గట్టిగానే చెప్పారు. కౌంటర్‌ విమర్శలు, వార్నింగ్‌లు రాజకీయాన్ని వేడెక్కించాయి.

టీడీపీ శిబిరం నుంచి వచ్చిన విమర్శలకు మరింత పదునైన మాటలతో బదులిచ్చారు గోరంట్ల మాధవ్‌. పరిటాల రవి గురించి తాను చెప్పింది చాలా తక్కువ అని.. ఆయనపై పది రక్తచరిత్రలు తీయొచ్చని కామెంట్స్‌ చేశారాయన. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేనున్నాను అని ముందుకొచ్చారు. పరిటాల హయాంలో ఎన్ని రక్తచరిత్రలు జరిగాయో ఆధారాలతో సహా రెండు రోజుల్లో వివరిస్తానన్నారు ప్రకాష్‌రెడ్డి.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిటాల కుటుంబం సైలెంట్‌ అయింది. టీడీపీ కార్యక్రమాల్లో తప్ప పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. కానీ.. తాజా ఎపిసోడ్‌లో బయటకు రాక తప్పలేదు. ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలకు తమదైన శైలిలో బదులిచ్చినా.. మళ్లీ ఆ స్థాయిలో వాగ్భాణాలు సంధించడం లేదు. పాత విషయాలను తిరగదోడటానికి ఇష్టపడలేదో ఏమో పరిటాల శిబిరం కొంత వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోందని పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపించే మాట.

ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్‌ అనే మాట మర్చిపోయి చాలా రోజులు అయింది. రాజకీయంగా వర్గపోరు మాత్రమే నడుస్తోంది. కానీ.. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తెస్తారో.. మాటల దాడి వరకే పరిమితం అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news