: రాజానగరంకు రాజప్ప..బాబు రివర్స్ ఫార్ములా?

-

ఈ సారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాకపోతే..ఇక ఇవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పిన చంద్రబాబు..ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. గతంలో మాదిరిగా నేతల పట్ల కాస్త మెతక వైఖరి ఉండటం మానేశారు. తనకు ఎక్కడైనా గెలిచే నేతలే కావాలని చెప్పి చూస్తున్నారు. అందుకే సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి నాయకుడినైనా పక్కన పెట్టడానికి వెనుకాడటం లేదు.

ఈ క్రమంలోనే ఇటీవల రాజానగరం టీడీపీ ఇంచార్జ్ పెందుర్తి వెంకటేష్‌కు బాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు అక్కడ సరిగ్గా పనిచేయడం లేదని, బడుదేబాదుడు కార్యక్రమం చేయడం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం లేదని, వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ధీటుగా పనిచేయడంలో విఫలమయ్యారని వెంకటేష్‌పై ఫైర్ అయ్యారు. కమ్మ నాయకుడైన సరే వెంకటేష్‌ని ఏ మాత్రం వదిలిపెట్టలేదు.

అయితే రాజానగరంలో కాపుల హవా ఉంటుంది..పైగా రాజా కాపు వర్గం ఎమ్మెల్యే..దీంతో బాబు వ్యూహం మార్చేస్తున్నారు. వెంకటేష్‌కు సీటు ఇవ్వకుండా, అక్కడ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పని బరిలో దింపాలని ప్లాన్ చేశారట. కాపు వర్గానికి చెందిన రాజప్ప అయితేనే..రాజానగరంలో రాజాకు గట్టి పోటీ ఇస్తారని భావించారట. ఇప్పుడు ఆ దిశగానే రాజప్ప కూడా రాజానగరంలోకి ఎంట్రీ ఇచ్చారని తెలిసింది. ఇటీవలే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకుని రాజానగరంలో అడుగుపెట్టారు. రాజప్ప ఎంట్రీతో రాజానగరంలో టీడీపీ క్యాడర్‌లో జోష్ వచ్చిందని తెలిసింది.

అయితే రాజప్ప ప్రస్తుతం పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సీటుని దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకట రమణ చౌదరీకి ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలిసింది. కమ్మ వర్గానికి చెందిన బొడ్డు..గతంలో టీడీపీ నుంచి పలుమార్లు పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ మధ్య అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన వారసుడు రమణ తెరపైకి వచ్చారు. పెద్దాపురంలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువే. అందుకే బొడ్డు వారసుడుని పెద్దాపురంలోనే దించాలని చూస్తున్నారట.

అంటే చంద్రబాబు రివర్స్ స్ట్రాటజీతో ముందుకెళుతున్నారు. కాపు వర్గం హవా ఉన్న రాజానగరంలో కమ్మ నేత పెందుర్తి వెంకటేష్‌ని పక్కన పెట్టి..కాపు నేత రాజప్పని నిలబెట్టాలని, పెద్దాపురంలో కమ్మ నేత వెంకటరమణని నిలబెట్టాలని భావిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news