తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 జరుగనున్న విషయం తెలిసిందే. అంటే కేవలం 14 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 30న ఎన్నికలు జరిగితే.. డిసెంబర్ 03న తెలంగాణతో పాటు మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ కొనసాగనుంది. ఈ తరుణంలోనే తాజాగా నిర్వహించిన ఈగల్ సర్వే ప్రకారం.. తెలంగాణలో బీజేపీకి 44 శాతం, బీఆర్ఎస్ కి 37 శాతం, కాంగ్రెస్ 15 శాతం, ఇతరులు 5 శాతం ఓట్లు సాధించనున్నట్టు తెలుస్తోంది.
మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పగా.. కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎవ్వరూ ఊహించనివిధంగా బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఈగల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. చూసినట్టయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ సభ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఎస్సీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని బీజేపీ ప్రకటించింది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇవ్వలేదు. అలాగే ఎస్సీ విభజన కూడా చేస్తానని హామీ ఇచ్చారు ప్రధాని. ఎస్సీలు, బీసీలు బీజేపీకి మద్దతు ఇస్తే అధికారంలోకి బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ 58 సంవత్సరాలు పరిపాలించగా.. బీఆర్ఎస్ దాదాపు పదేళ్లు పరిపాలించింది. ఒక్కసారి కూడా పరిపాలించని బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. కానీ ఎవ్వరూ గెలుస్తారనేది డిసెంబర్ 03న వెలువడే ఫలితాల్లో తేలనుంది.