ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా దృష్టి పెట్టారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏ విధంగా అయినా సరే ఏకగ్రీవం చేయడ౦ కోసం నామినేషన్ పత్రాలను లాక్కుని అరాచకం సృష్టిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయంగా అధికార పార్టీ ఎంతో బలంగా ఉంది. దీనితో నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది అంటున్నారు. దీనిపై బిజెపి ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేసారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న దాడులు, అరాచకాలపై ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ శుక్రవారం పార్లమెంటు భవనంలో హోం మంత్రికి ఫిర్యాదు చేసారు,
దీనిపై అమిత్ షా ఘాటుగానే స్పందించారని అంటున్నారు. అరాచకాలు శృతి మించితే తాము రంగంలోకి దిగుతామని మరికొన్ని ఆధారాలు తమకు కావాలని ఆయన కోరారట. రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలి, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అన్నీ కూడా కేంద్రం ఆరా తీసింది. మాచర్ల ఘటనపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లను ఆయన వీక్షించారట.
పరిస్థితి మరింతగా శృతి మించితే తాము రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటాం అని చెప్పారట అమిత్ షా. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బీజేపీ అభ్యర్థులపై ఒత్తిడితెస్తున్నారనే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్ళారు. వీటిపై షా సానుకూలంగా స్పందించారట.