ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఫిక్స్… జగన్ అసెంబ్లీకి వస్తారా…!

-

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ అయింది.ఇప్పటికే సీఎం సహా మంత్రుల ప్రమాణ స్వీకారం ఘట్టం పూర్తయింది. ఇక స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 21న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉండాలని టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాల్లో చీఫ్ విప్ ఎన్నిక కూడా ఉంటుంది.అయతే ఇప్పుడు మాజీసీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ తరఫున శాసన సభా పక్ష నేత ఎవరనేది? కూడా తేలాల్సివుంది.

మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ 11 సీట్లకే పరిమితం అయింది. మొత్తం 175 సీట్లకు గాను పదిశాతం స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈ మార్క్ కు వైసీపీ 7 స్థానాలు వెనుకబడి ఉంది.ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వస్తారా? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే. అందులోనూ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఆయన సభలో ఉంటారని భావించలేం.2014లో 66 మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.అత్యంత సీనియర్ అయిన పెద్దిరెడ్డికి ఆ బాధ్యత అప్పగించడం సరైనదని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం.

ఏపీ అసెంబ్లీలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూడబోతున్నాం ఈసారి. శాసనసభలో ప్రతిపక్షం, ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో వైసీపీ సభ్యులకు వెనుక వరుసలో సీట్లు రానున్నాయి.ఈ పరిణామం వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి. అందులోనూ మొన్నటివరకు 151 ప్లస్ సీట్లతో అత్యంత వైభవం చూసిన పార్టీకి ఇప్పుడు వెనకాల ఎక్కడో సీట్లు కేటాయించడం పట్ల వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.దీనిపై జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోందని చర్చలు నడుస్తున్నాయి.అయితే జగన్ ఎలాంటి పరిస్థితినైనా హుందాగా ఎదుర్కొంటారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.ఇప్పుడు కూడా అసెంబ్లీలో 10 మంది మిగతా సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తారని, వైసీపీ శాసన సభా పక్ష నేత ఆయనే ఉంటారని ఓ వర్గం నేతలు అంటున్నారు.మరి 21,22 తేదీల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news