ఏపీ బీఏస్పీ కి ఒక ఆరెస్పీ కావాలంట… వినిపిస్తుందా…?

-

ఇంతకాలం “బహుజనులకు రాజ్యాధికారం” అనే మాటలు అప్పుడప్పుడూ వినిపించేవి. సోకాల్డ్ రాజకీయ పార్టీల నుంచి ఆ మాటలు ఎప్పుడూ రాకపోయినా.. అప్పుడప్పుడూ కమ్యునిస్టుల నుంచి వినిపించేది! తెలంగాణ ఉద్యమ సమయంలో… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటించినా.. ఆఖరికి అది వెన్నుపోటుగానే మిగిలిన పరిస్థితి! అయితే అది గతం!

అవును… బీఏస్పీ లీడర్లు అప్పుడప్పుడూ అంబేద్కర్ భవన్ లోనో, బీసీ ఫంక్షన్ హాల్స్ లోనో కూర్చుని ప్రసంగాలు చేసుకునేటప్పుడు మాత్రమే “బహుజన రాజ్యాధికారం”, “బహుజనవాదం” మాటలు వినిపించేవి. మీడియా కూడా వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. జోన్ పేజీలకే ఆ వార్తను పరిమితం చేసేది! కానీ.. ఊహించనివిధంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రూపంలో తెలంగాణలో బీఎస్పీ ఒక్కసారిగా లేచింది! అది ఇప్పుడు ఏపీకీ వ్యాపిస్తుంది!

ఏనుగెక్కి ప్రగతిభవన్ కు వెళ్దాం అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఎత్తుకున్న వాదనకు మీడియా నుంచి కూడా బలమైన మద్దతు లభిస్తోంది! ఇక సోషల్ మీడియాలో అయితే… ప్రస్తుతం బహుజనుల్లో ఆర్.ఎస్.పి. హీరో అయిపోయారు! ఇంతకాలం సరైన నాయకత్వం కోసం చూస్తున్న బహుజనులను ఏకతాటిపైకి తెచ్చేపనికి పూనుకున్నారు. సఫలీకృతులయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు!

ఈ క్రమంలో… ఏపీలో కూడా ఈ బహుజనవాదం చాపకిందనీరులా వ్యాపిస్తుందనే మాటలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి! ఈసారి ఒక బలమైన శక్తిగా బహుజనులు మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సమయాల్లో బీసీలకు 100సీట్లు, ఎస్సీలకు మంత్రిపదవులు అని ప్రకటించడం.. ఒకసారి ఒకరికి – మరోసారి మరొకరిని అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్న ఈ బహుజనవర్గం… ఇకపై తమ ఇంటిని తాము చక్కబెట్టుకోవాలనే పనికి పూనుకుంటున్నాయి!

అందులో భాగంగానే… మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో గ్రామస్థాయి – మండలస్థాయి – నియోజకవర్గాల స్థాయిలో సభలూ – సమావేశాలు జరుగుతున్నాయి. ఎస్సీ – ఎస్టీ – బీసీ – మైనారిటీ లతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలు కలిసి ఒక గొడుకు కిందకు రావాలని.. ఆ గొడుకు బీఎస్పీ అవ్వాలని చేసే ఆలోచనలు పెరుగుతున్నాయి. ఫలితంగా… ఏపీలో కూడా ఆర్.ఎస్.పీ. లాగా ఒక బలమైన నాయకుడు రంగంలోకి దిగితే… బీఎస్పీకి ఫుల్ డిమాండ్ అని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news