ఒక్క దెందులూరు చాలదా? ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌లు ఎలా అదుపుత‌ప్పాయో?

-

  • చింత‌మ‌నేని ఆగ‌డాల‌పై చేష్ట‌లుడిగిన పోలీసులు
  • అధికార పార్టీ నేత‌ల ఒత్తిడితో మౌనం
  • అధికారులైనా, పార్టీనేత‌లైనా, ప్ర‌తిప‌క్ష‌ముపైనా దాడే
  • మ‌ట్టి, ఇసుక త‌వ్వేస్తున్నా నిద్ర న‌టిస్తున్న యంత్రాంగం
  • అదేమంటే త‌న్నులు, పిడిగుద్దులు, భౌతిక దాడులు
  • మీడియాపై సైతం బూతుపురాణం
  • లేడీ ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడి త‌రువాత సీరియ‌ల్ దాడులు
  • పేప‌ర్ టైగ‌ర్‌లా మారిన ఏపీ సీఎం

AP Police Fires On MLA Chintamaneni Prabhakar

ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌లు ఎంత‌గా గాడి త‌ప్పాయో చెప్ప‌డానికి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విష‌యం చాలు. అక్క‌డ పోలీసులు ప్రేక్ష‌క పాత్ర వ‌హించ‌డంకాదు… ఎమ్మెల్యేకు స‌హాయంగా ఆయ‌న టార్గెట్ చేసిన వారిని కొడుతున్నారు కూడా. ఇసుక‌, మ‌ట్టిని అడ్డంగా త‌వ్వేస్తూ… కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అరాచ‌కాల‌ను రెవెన్యూ, పోలీసు, జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు స‌మ‌ర్థిస్తున్నార‌నిపిస్తోంది. ఈ విష‌యంలో మొద‌ట్లోనే అడ్డుక‌ట్ట వేయ‌డానికి ప్ర‌య‌త్నించిన ఎమ్మార్వో వ‌న‌జాక్షిని స్వ‌యంగా ఎమ్మెల్యే చింత‌మ‌నేని వ‌చ్చి ప‌చ్చి బూతులు తిట్ట‌డ‌మేకాదు, చేయి కూడా చేసుకున్నా దిక్కులేదు. స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబునాయుడు ఆ కేసును నీరుగార్చాడు. రెవెన్యూ ఉద్యోగుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో కాస్త వెన‌క్కిత‌గ్గారు. ఆ త‌రువాత ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై, మీడియాపై, చివ‌ర‌కు విజిలెన్స్ అధికారుల‌పై కూడా చింత‌మ‌నేని అండ్ కంపెనీ భౌతిక దాడులు చేసి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంటే కేసు న‌మోదు చేయ‌డానికి కూడా పోలీసులు ముందుకురావ‌డం లేదంటే ఏపీలో పోలీసులు రాజ‌కీయ నాయ‌కుల గూండాగిరికి ఎంత తొత్తులుగా మారారో అర్థ‌మైపోతోంది. ఇక రాజ‌కీయ పార్టీల ధ‌ర్నాలు, ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో కేసులు క‌డుతున్నా.. స్టేష‌న్ బెయిల్‌తో స‌రిపెడుతున్నారు. ఇలాంటి ఒక రౌడీని ప్ర‌భుత్వ విప్‌గా నియ‌మించిన చంద్ర‌బాబునాయుడును ప్ర‌జ‌లు ఏమ‌నాలి? ఈయ‌న బ‌హిరంగ‌స‌భ‌ల్లో చెప్పే శాంతిభ‌ద్ర‌త‌ల సూక్తులు విని దేనితో న‌వ్వాలో అర్థం కావ‌డం లేదు. ఇక హోంమంత్రి చిన‌రాజ‌ప్ప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అరాచ‌కాల‌ను అక్క‌డ ఎస్పీ కూడా ఆప‌లేక‌పోతున్నారంటే పోలీసుల దుస్థితి చూసి సిగ్గుప‌డాల్సి వ‌స్తోంది. రోజు వంద‌ల లారీల‌, ట్రాక్ట‌ర్ల ఇసుక‌, మ‌ట్టిని అడ్డంగా త‌వ్వేస్తూ… అమ్మి కోట్ల రూపాయ‌లు సొమ్ము చేసుకుంటుంటే మ‌న‌వాడేలే అంటూ పేరు గొప్ప సీఎం చంద్ర‌బాబు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు చూస్తున్నారు. మీడియాలో, ప్ర‌తిప‌క్షాలో గ‌ట్టిగా వేలెత్తిచూపిస్తే, ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేసి ప్ర‌జ‌ల దృష్టిలో పెడితే…త‌న తొత్తులైన మీడియా రిపోర్ట‌ర్ల ద్వారా చింత‌మ‌నేనిని గ‌ట్టిగా మంద‌లించిన సీఎం చంద్ర‌బాబు అంటూ పేప‌ర్ టైగ‌ర్ ప్ర‌క‌ట‌న‌లు ఇప్పిస్తారు.

నిజంగా ఒక సీఎం ఎమ్మెల్యేని వార్నింగ్ ఇస్తే… దాడులు వ‌రుస‌గా ఎందుకు జ‌రుగుతున్నాయి? అంటే చింత‌మ‌నేని సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌ను కూడా లెక్క‌చేయ‌డం లేద‌నుకోవాలా? డ్రామా అనుకోవాలా? ఇంత‌కీ ఎమ్మెల్యే చింత‌మ‌నేనికి ఎవ‌రిని చూసుకుని అంత కండ‌కావ‌రం, ఎవ‌రి అండ చూసుకుని ప్ర‌జ‌ల ఆస్తుల‌ను అడ్డంగా దోచుకుంటున్నారు? ఇలాంటి నేర చ‌రిత్ర ఉన్న వ్య‌క్తుల‌కు ప‌ద‌వులు ఇచ్చి అంద‌ల‌మెక్కించే సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ల్లించే నీతి సూక్తుల‌ను ప్ర‌జ‌లు ఎలా న‌మ్మాలి? మ‌ంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో చింత‌మ‌నేనికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని, ఏకంగా కొత్త పార్టీనే పెట్టాల‌ని నిర్ణ‌యించిన చింత‌మ‌నేని ఎందుకు చంద్ర‌బాబు ఉపేక్షిస్తున్నారు? త‌న సామాజిక వ‌ర్గ‌మ‌నా? చేత‌గానిత‌న‌మా? లేక దోపిడీలో తానూ ఒక భాగ‌స్వామా? మ‌ట్టిని, ఇసుకను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న విజిలెన్స్ అధికారుల‌ను కూడా కొద్ది రోజుల క్రితం భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి అర్ధ‌రాత్రి వారి ముందే త‌న లారీల‌ను ఇడిపించుకుపోతే దిక్కులేదు. సాక్షాత్తూ విజిలెన్స్ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు లేవు. ఆ విష‌యాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి వెళ్లిన మీడియాను ఆ కార్యాల‌యం ముందే చింత‌మ‌నేని ల‌కారాల‌తో తిడితే గ‌తి లేదు. ఆ త‌రువాత వారం ప‌ది రోజులు గ‌డ‌వ‌క ముందే వైసీపీకి చెందిన క్రిష్ణ అనే నాయ‌కుడిని చిత‌క‌బాదారు. అత‌ను చేసిన నేర‌మ‌ల్లా చింత‌మ‌నేని అక్ర‌మ వ్యాపారాల‌పై బాధ్య‌త‌గ‌ల ప్ర‌తిప‌క్షంగా విమ‌ర్శించ‌డ‌మే. అక్క‌డితో ఆగ‌లేదు.

తెలుగుదేశానికే చెందిన మాజీ స‌ర్పంచు చింత‌మ‌నేని జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు చెందిన మ‌ట్టిని అడ్డంగా తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడ‌ని ఎవ‌రికీ తెలియ‌కుండా ఎస్పీ కార్యాల‌యానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ విష‌యం వెంట‌నే చింత‌మ‌నేనికి ఎవ‌రు చేర‌వేశారోకానీ…అదే రోజు మాజీ స‌ర్పంచు ఇంటికెళ్లి చింత‌మ‌నేని అనుచ‌రులు కొట్టుకుంటూ జీపులో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు. అక్క‌డ మ‌రోసారి ఎమ్మెల్యే, ఆయ‌న గ‌న్‌మెన్ కూడా ఆ మాజీ స‌ర్పంచుపై విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్న అత‌న్ని గ్రామ‌స్తులు తీసుకెళ్లి ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ గ్రామం మొత్తం తెలుగుదేశానికి వ్య‌తిరేకంగా ఒక్క‌టై పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు చించేశారు. ఇక్క‌డ గ్రామ‌స్తులంతా ఏకం కావ‌డంతో మ‌రుస‌టి రోజు చింత‌మ‌నేని గ్రామానికి వెళ్లి క్ష‌మాప‌ణ చెప్పారు. కానీ అధికార పార్టీ నాయ‌కుల ఆగ‌డాల‌కు పోలీసులు ఎలా స‌హ‌క‌రిస్తున్నారో ఈ ఉదంతంతో స్ప‌ష్ట‌మైపోయింది. మాజీ సర్పంచ్ ఎస్పీని క‌లిసి చింత‌మ‌నేనిపై ఫిర్యాదు చేసిన విష‌యం ఆఘ‌మేఘాల‌పై ఎమ్మెల్యేకి ఎలా తెలిసింది? ఎస్పీ చెప్పారా? లేదా ఎస్పీ కార్యాల‌యం జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇస్తే, వారు ఎమ్మెల్యేకి చేర‌వేశారా? స‌మాచారం ఎవ‌రు చెప్పార‌నేదానికంటే ఎమ్మెల్యే అరాచ‌కాల‌ను అరిక‌ట్ట‌డానికి ఇటు పోలీసులు, అటు జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారులు ప్ర‌య‌త్నించ‌కపోవ‌డం వ్య‌వ‌స్థ విధ్వంసాన్ని సూచిస్తోంది. చింత‌మ‌నేని అరాచ‌కాల ప‌రంప‌ర కొన‌సాగ‌డానికి రాష్ట్ర డిజిపి, సీఎం, హోంమంత్రి నైతిక బాధ్య‌త వ‌హించాలి. పౌర స‌మాజానికి భేష‌రుతుగా క్ష‌మాప‌ణ చెప్పాలి. ఆ త‌రువాతే రాష్ట్రంలో స‌భ‌ల్లో, స‌మావేశాల్లో నీతులు, సూక్తులు వ‌ల్లించాలి. ఇది రాష్ట్రంలోని పౌరుల డిమాండ్‌.

Read more RELATED
Recommended to you

Latest news