ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి ఇంఛార్జ్ బాధ్యతలు అందుకున్నారు మంత్రి కొడాలి నాని. ఆ విధంగా ఆయన ఆ నియోజక వర్గ ఎన్నికల బాధ్యతలతో పాటు ప్రచార బాధ్యతలు కూడా ఆయన చూసుకోవాలి. చూసుకున్నారు కూడా ! కానీ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీ అయితే రాలేదు. అసలు రాదు అని కూడా ఎప్పుడో తేలిపోయింది. అయినా కూడా వైసీపీ ఆఖరి నిమిషం వరకూ తనదైన ప్రయత్నాలు చేసిందని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి ఉ ప ఎన్నికల్లో ఇవాళ విడుదలయిన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి, దివంగత నేత మేకపాటి గౌతం రెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కి 19,316 ఓట్లు పోల్ అయ్యాయి అని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని, పేర్నినాని లాంటి మాజీ మంత్రులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన్ను ఉద్దేశించి కొంత అనుచిత భాషను కూడా ఉపయోగించి మాట్లాడారు. బీజేపీ కూడా తనవంతు ప్రయత్నాలు చేసినా అనుచిత భాషను అయితే ఉపయోగించలేదు. ముఖ్యంగా జగన్ సర్కారును మరీ అంత మాటలతో అయితే ఆడిపోసుకున్నది కూడా లేదు. వాస్తవానికి ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉన్నా ఎందుకనో బీజేపీ పట్టుబట్టి మరీ ! అభ్యర్థిని నిలిపింది.టీడీపీ మరియు జనసేన సంప్రదాయాలను అనుసరించే అభ్యర్థిని బరిలో దింపలేదు.
అయితే మేకపాటి కుటుంబం నుంచి మొదట్నుంచి వినిపిస్తున్న పేరు (శ్రీకీర్తి, మేకపాటి గౌతం రెడ్డి భార్య) కాకుండా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పేరును ప్రతిపాదించింది.అన్న గౌతం రెడ్డి (ఐటీ శాఖ మంత్రి) హఠాన్మరణంతో ఇక ఇక్కడ పోటీ అనివార్యం కావడంతో ఈయన బరిలోకి దిగక తప్పలేదు. మొదట్నుంచి ఎన్నిక అన్నది సులువే అని భావించినా, మంచి మెజార్టీతో రావాలని మంత్రులకు జగన్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకే మంత్రులు కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా విపక్ష నేతలను ఉద్దేశించి ఈ ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ మంత్రుల భాష అస్సలు గౌరవనీయ స్థాయిలో లేదు. అంగీకరించదగ్గ స్ధాయిలో లేదు.
అంతేకాదు సంక్షేమ పథకాల ప్రభావం ఉంటే మంచి మెజార్టీ వచ్చే ఉండేది అని, కానీ అవి కూడా పెద్దగా ఈ ఎన్నికలపై ప్రభావం చూపించలేదని ఓ వర్గం విశ్లేషణ. అయినా ఇప్పటికైనా కొంత తప్పులు దిద్దుకుని సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఓ గొప్ప సామాజిక అవసరం అని గుర్తిస్తే మేలు అని అంటున్నారు పరిశీలకులు. కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని మాట్లాడితే ఇంకా మేలు అన్న వాదన కూడా కొడాలి నాని లాంటి వారిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న ఓ వ్యాఖ్య.