ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే తెలుగుదేశం పార్టీ జీవన్మరణ పోరాటం చేస్తోంది. జిల్లాలలో మినీ మహానాడుల నిర్వహణ పూర్తయితే ఈ నెల 27,28 తేదీలలో మహానాడు నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఏమయినా మార్పులు వస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్నది క్రిస్టల్ క్లియర్. అందుకు అనుగుణంగా పార్టీ నాయకత్వం కూడా పనిచేయాల్సి ఉంది.
ఏం చేయాలో చూద్దాం.. ఎలాంటి నిర్ణయాలు పార్టీ మనుగడను ముందుకు తీసుకువెళ్తాయో కూడా చర్చిద్దాం.. ఆ వివరం ఈ కథనంలో…
ఒకప్పుడు తెలుగుదేశం వేరు..ఇప్పుడు తెలుగుదేశం వేరు. ప్రాంతీయ పార్టీల పుట్టుక అన్నది ఓ సంచలనం అయితే ఆ విధంగా తెలుగుదేశం రాక, ఆ విజయ పతాక అన్నవి సంచలనమే ! నో డౌట్ ! అన్నగారి నుంచి అల్లుడి గారి వరకూ పార్టీ అనుకున్న విజయాలు సాధించింది. ఓటముల్లో తలదించింది. గెలుపులో పొగరుతోనే పనిచేసింది. తప్పేం కాదు ఇప్పుడు వైసీపీ లో కొందరు నాయకుల సరళి ఏ విధంగా ఉందో ఆ రోజు తెలుగుదేశం నాయకుల సరళి కూడా అదే విధంగా ఉంది. అధికార దర్పం అందరిలో కాకపోయినా కొందరిలో ఉండేది. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఏవయినా తప్పులు చేశానా నేను అని అధినేత చంద్రబాబు ఇవాళ ప్రజలను అడుగుతున్నారంటే అందుకు కారణం ఆనాటి పరిణామాలే ! ఇప్పుడు కూడా దిద్దుకోకపోతే ఇంకెప్పుడూ ఆశించిన విధంగా ఎదుగుదల సాధ్యం కాదు.
ఇక ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని శక్తి. 9 ఏళ్లు తిరుగులేని శక్తి.. చంద్రబాబుది కూడా ! ఆయన విజనరీగా పేరుతెచ్చుకున్నారు. వివాదాల పరంగా కూడా అదేవిధంగా ఉన్నారు. ముఖ్యంగా విదేశీ రుణాల సేకరణ, ఖర్చు ఇలాంటి విషయాల్లో చంద్రబాబు తెలివిగానే ఉన్నారు. ఆయన కారణంగానే హైటెక్ సిటీ పురుడు పోసుకుంది. మంచి ఫలితాలు అందుకుంది. అదేవిధంగా బయో మెడికల్ రంగం కూడా అభివృద్ధి చెందింది. ఇందులో కూడా సందేహం లేదు కానీ ఆ రోజు ఆయన కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని పరువు పోగొట్టుకున్నారన్నది అప్పటి విపక్ష నాయకుల విమర్శ. అదే ఆయనకు శాపం. ఆ తరువాత నవ్యాంధ్రలో కూడా అలాంటి నియంత్రిత లేదా నియంతృత్వ నిర్ణయాలే తీసుకున్నారు. అవే ఆయన రాజకీయ జీవితాన్ని బాగా ప్రభావితం చేసి యువకుడు అయిన జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం దక్కేందుకు కారణం అయ్యాయి. ఇప్పుడు విపక్షంలో ఉంటూ అంతర్మథనం చెందుతున్నారు సరే ! పార్టీ ప్రక్షాళన ఎప్పుడు అన్నదే పెద్ద డౌట్.
ఇవి చేయండి సర్ ..
దిగువ స్థాయి నుంచి పార్టీలో చేయాల్పిన మార్పులు చేశాకే ఆయన ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడే ఆయన మంచి ఫలితాలు అందుకుంటారు. జిల్లాలలో వర్గ పోరు తగ్గించాలి. అదేవిధంగా ఇప్పటికే టిక్కెట్లు ఎవరికి అన్నది కన్ఫం చేస్తే వాళ్లంతా మరింత ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. వైసీపీని ఢీ కొనడం కష్టం అయినా కూడా అసాధ్యం కాదు. ఒకవేళ అధికారం అడ్డుతో
తప్పిదాలు చేసినా లేదా అరాచకాలు చేసినా వాటిపై కూడా ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు కనుక ఆ దిశగా వాటి వివరాలను ప్రజలకు వివరించాలి. అప్పుడే బాబు సక్సెస్ అవుతారు. లేదంటే లేదు.