మునుగోడులో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా దిగిందని.. నియోజకవర్గంలో భూములన్నీ కబ్జా చేసేందుకు రెడీగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని అన్నారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నాయని మండిపడ్డారు.
టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆ పైసలన్నీ కచ్చితంగా తీసుకోవాలని, ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేసి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు.