దమ్ముంటే రా కేసీఆర్.. బల ప్రదర్శనకు బీజేపీ సిద్ధం : బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పై బండి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బండి మండిపడ్డారు. బీఆర్‌ అంబేడ్కర్‌కు గౌరవం ఇచ్చిన పార్టీ.. దళితుల్ని ఎలా మోసం చేసిందని ప్రశ్నించారు. పోడు భూముల పేరుతో గర్భిణీలపై లాఠీఛార్జ్‌ చేయించిన పార్టీ టీఆర్ఎస్ అని గుర్తు చేశారు.

ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వచ్చారని తెలిపారు. మజ్లిస్‌ను కలుపుకొని వచ్చినా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. కొత్త సచివాలయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు.