బండి సంజయ్ ‘యాత్ర’: టార్గెట్ రీచ్ అవుతారా?

గతంలో తెలంగాణలో బి‌జే‌పికి పెద్దగా పట్టు ఉండేది కాదు. ఏదో ఆ పార్టీ ఒకటి, రెండు సీట్లు మాత్రం గెలుచుకుంటూ ఉండేది. ఆఖరికి 2018 ఎన్నికల్లో కూడా బి‌జే‌పికి తెలంగాణలో బలం లేదని రుజువైంది. అప్పుడు కూడా ఆ పార్టీ ఒక సీటే గెలుచుకుంది. కానీ ఆ తర్వాత నుంచే తెలంగాణలో రాజకీయం మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బి‌జే‌పి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. పైగా నిదానంగా కాంగ్రెస్ వీక్ అవుతూ వస్తుండటం బి‌జే‌పికి కలిసొచ్చింది. దీనికితోడు బండి సంజయ్ బి‌జే‌పి అధ్యక్షుడు అయ్యాక రాజకీయం ఒక్కసారిగా మారింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అసలు ఉపఎన్నిక అంటే టి‌ఆర్‌ఎస్‌కు తిరుగుండదు. అలాంటిది దుబ్బాక ఉపఎన్నికలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి కమలం ఓటమి రుచి చూపించింది. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్‌కు చుక్కలు చూపించింది. ఇలా ఊహించని విధంగా బి‌జే‌పి పుంజుకుంది. కానీ ఇదే సమయంలో టి‌పి‌సి‌సి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఊహించని విధంగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దీంతో బి‌జే‌పి పని అయిపోతుందనే వ్యాఖ్యలు కూడా వినిపించడం మొదలయ్యాయి.

ఈ క్రమమలోనే బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించడం బి‌జే‌పికి ఫుల్ అడ్వాంటేజ్ అవుతుంది. పాదయాత్ర ద్వారా బండికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. అలాగే పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యలని హైలైట్ చేస్తూ, కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే రాష్ట్రానికి ఇచ్చే కేంద్ర పథకాలని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి తమ పథకాలుగా కే‌సి‌ఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మోడీ సర్కార్ కేవలం హిందూ ప్రజలకే పథకాలు ఇవ్వడం లేదని, అన్నీ మతాలని సమానంగా చూసుకుంటుందని చెబుతూ, మిగిలిన మతాలని సైతం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బండి పాదయాత్ర వల్ల బి‌జే‌పికి కొత్త ఊపు రావడం ఖాయం. ఈ ఊపు ఇలాగే కొనసాగితే తెలంగాణలో బి‌జే‌పి బలమైన పార్టీగా అవతరించడం ఖాయమే.