కాంగ్రెస్‌లో చేరికలు ప్రారంభమయ్యాయి అని ఇది తమ పార్టీకి శుభ సూచకమని, ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించిన నేతలందరూ కాంగ్రెస్ లోకి వస్తున్నారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అంటున్నారు. తాజాగా మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి..కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇందులో కుంభం..మొన్నటివరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. తర్వాత బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. మళ్ళీ వెంటనే కాంగ్రెస్ లోకి వచ్చేశారు.
2018 లో ఓటమి పొందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆ తర్వాత భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వారికి అండగా ఉన్నారు. కానీ ఊహించని విధంగా ఆయన బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉన్న విభేదాల వల్లే ఆయన బిఆర్‌ఎస్ లోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. కానీ బిఆర్‌ఎస్ లో ఆయనకు తగిన స్థానం దక్కలేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డికి..బిఆర్‌ఎస్ సీటు ఫిక్స్ చేశారు.
దీంతో అనిల్ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ రేవంత్ రెడ్డితో టచ్ లోకి వచ్చారు. ఇక అధిష్టానం సూచనల మేరకే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించామని రేవంత్ తెలిపారు. కుటుంబంలో చిన్నచిన్న కలతలు సాధారణమేనని అలాంటి కలతలతోనే విడిపోయిన అనిల్ తన కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల బిఆర్ఎస్ లోకి వెళ్లానని, అక్కడ ఇమడలేక మళ్ళీ సొంత గూటి కి వచ్చానని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇలా అనిల్ తిరిగిరావడంతో భువనగిరి కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. అయితే సీటు అనిల్‌కు ఇస్తారా? లేదా వేరే నేతకు ఇస్తారా? అనేది క్లారిటీ రాలేదు. ఎవరికి సీటు ఇచ్చిన కలిసి పనిచేస్తేనే భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తుంది.