కేంద్రం పిలుపునకు కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు

దేశంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి నేటి నుంచి ఉచిత వ్యాక్సిన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఉచితంగా అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్‌ 21 నుంచి నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కేంద్రం ఉచిత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రం ఉచితంగా అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రం ఇచ్చిన పిలుపునకు కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ కు కనీస కృతజ్ఞత భావం కూడా లేదని అన్నారు. ప్రోటోకాల్‌‌ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ వద్ద ప్రధానమంత్రి ఫోటో వేయకుండా, రాష్ట్ర నాయకుల ఫోటోలు పెట్టడం శోచనీయన్నారు. కేంద్రం వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసిన వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించాలని పిలుపునిచ్చారు.