తెలంగాణాలో ఈ నెల రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ రెండు రాజ్యసభ స్థానాల కోసం మాత్రం అధికార తెరాస లో నెలకొన్న పోటీ అంతా ఇంతా కాదు. కెసిఆర్ ని కేటిఆర్ ని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సమర్ధవంతులు ఇప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తే తమను తాము నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒకరిద్దరు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు.
అయితే కెసిఆర్ మాత్రం ప్రజల్లో ఉండే వాళ్ళకే రాజ్యసభ సీట్లు కూడా అని చెప్పారు. దీనితో వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారు. వాస్తవానికి ఆయనకు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద మంచి పేరు ఉంది. పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి నేతను రాజ్యసభకు పంపాలని కెసిఆర్ భావించారని మీడియా అంటుంది.
కెసిఆర్ కూడా ఆ విధంగా అడుగులు వేసారని తెరాస పార్టీ వర్గాలు కూడా కామెంట్ చేసాయి. అయితే ఇప్పుడు కెసిఆర్ ఆయన్ను ఎమ్మెల్సీ ని చేసి మంత్రిని చెయ్యాలని చూస్తున్నారు. ఆయన ఆర్ధికంగా బలంగా ఉండటంతో పాటుగా ప్రజల మనిషిగా పేరుంది. దీనితో ఆయనకు ప్రత్యేక వర్గం ఉంది. ఆయన ఆర్ధిక బలంతో కెసిఆర్ కి పెద్దగా పని లేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకత్వంలో ఆయనకు పట్టు౦ది.
కాస్త నల్గొండ జిల్లాలో కూడా ప్రభావం చూపించే మనిషి. దీనితో రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అని భావించారు. కాని ఇప్పుడు ఆయన్ను మంత్రిని చేస్తే ప్రయోజనం ఉంటుందని చూస్తున్నారట. ఇప్పటికే ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ మంత్రిగా ఉన్నారు. ఇక ఒక రాజ్యసభ సీటుని మళ్ళీ కే కేసవరావు కి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి హెటిరో డ్రగ్స్ అధినేత పార్ధ సారధి రెడ్డి ని పంపే అవకాశం ఉందని అంటున్నారు.