తెలంగాణలో వరుసగా ప్రశ్నా పత్రాల లీకేజ్ అవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీక్ అవ్వడం పై రచ్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా కేసిఆర్ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. ఇదే క్రమంలో టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ అవ్వడం సంచలనంగా మారింది. అయితే దీనిపై కూడా ప్రతిపక్షాలు..కేసిఆర్ సర్కారుపై మాటల దాడి మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఈ అంశంపై ఎక్కువగా కేసిఆర్ సర్కారుని టార్గెట్ చేస్తున్న బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రివర్స్ కౌంటర్ పడింది.
టెన్త్ పేపర్ల లీక్ లో బిజేపి నేతల హస్తం ఉందని, బిజేపి అనుబంధ ఉపాధ్యాయుల చేత పేపర్ల లీక్ చేయించి తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూశారని, ఇందులో బండి సంజయ్ కుట్ర కూడా ఉందని చెప్పి..ఆయనని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదంతా కక్షపూరిత చర్య అని, ప్రశ్నించే వారి గొంతు నోక్కేలా అరెస్టులు చేస్తున్నారని బిజేపి నేతలు ఫైర్ అవుతున్నారు..రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
కానీ ఇప్పటివరకు పేపర్ల లీకులపై పెద్దగా స్పందించని బిఆర్‌ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు బండి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. అసలు ఒక్కరోజులోనే బిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బండిని టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పేపర్ల లీకులో బండి హస్తం ఉందని అంటున్నారు. హరీష్ రావు, కేటిఆర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, బాల్క సుమన్, రేగా కాంతారావు, నిరంజన్ రెడ్డి..అబ్బో ఇలా వరుసపెట్టి బిఆర్‌ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ..బిజేపిపై విరుచుకుపడుతున్నారు.
అయితే ఇప్పటివరకు జరిగిన పేపర్ల లీకుల అంశాన్ని ఒక్కసారిగా ఈ అంశంతో డైవర్ట్ చేస్తున్నారా? అనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మరి నిజంగానే టెన్త్ పేపర్ల లీకులో బండి హస్తం ఉందా? లేక ఇందులో కారు పార్టీ రాజకీయం ఉందో తెలియాల్సి ఉంది.